పొన్నాలకు టిక్కెట్.. ఎవరికి థ్రెట్

Update: 2018-11-16 12:04 GMT
కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంతో సీనియర్.. పలు మంత్రిత్వ శాఖలు నెరిపిన వాడు.. వరుసగా ఒకే నియోజకవర్గం నుంచి గెలుస్తూ వస్తున్నాడు.. అలాంటి ఆయన్ని కాదని.. నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి - జత కట్టిన వారికి ప్యారాచుట్ లీడర్లకు టిక్కెట్లు కట్టబెట్టిన కాంగ్రెస్ కు తన రాజకీయానుభవాన్నంత రంగరించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు.. ఆయన మరెవరో కాదు.. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో తప్పకుండా ఆయన పేరు ఉంటుందని ఆశించిన వారికి భంగపాటు ఎదురయ్యింది. తర్వాత సెకండ్ లిస్ట్ లో ఉంటుందిలే అనుకుంటే మళ్ళా నిరాశే ఎదురైంది.. ఇక తన వ్యూహాలకు పదను పెట్టకపోతే తుప్పు పట్టిపోతామని.. టిక్కెట్ దక్కని భావించిన పొన్నాల నేరుగా అధిష్టానం ముందు వాలిపోయాడు.. గంటలు రోజులు గడుస్తున్నా.. పట్టిన పట్టు విడకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.. ఈ లోగా ఆ టిక్కెట్ కాస్త కూటమి చెలికాడు టిజెఎస్ నేత కోదండరాం కు కేటాయించడంతో అంతా అయిపోయిందనుకున్నారంతా.. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి - బతిమలాడి.. బిసి కార్డును చూపెట్టి మొత్తానికి పొన్నాల టిక్కెట్ సాధించడంలో సఫలమైనట్లే కనిపిస్తోంది.

పొన్నాలను ఎందుకు దూరం పెట్టినట్టు?

కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో ఎవరూ చెప్పలేరు.. కానీ బయటి వాతావరణం చూసి.. కొన్ని అనుకూల పవనాలు చూసి ఆ పార్టీ నేతలంతా తాము అధికారంలోకి రావటం ఖాయమనే నమ్ముతున్నారు.. ఇంకా పోలింగే జరగలేదు.. ఫలితాలు రాలేదు.. అప్పుడే సిఎం నేనంటే నేననే వాదనలు తెరపైకి వచ్చాయి. ఇదంతా కాంగ్రెస్ పార్టీలో షరా మామూలే.. కాస్తంత సీనియార్టీ ఉన్న ప్రతి నాయకుడు ఆ పార్టీలో సిఎం అభ్యర్థిలానే ఫీలవుతున్నారు.. ఏ మాత్రం అవకాశం ఉన్నా సీటుపై ఎక్కేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు.. ఈ నేపథ్యంలో అధికారానికి దూరమైన రెడ్డి వర్గంలోనే అధిక పోటీ ఉంది.. ఎవరికి వారు ఎత్తులకు పై ఎత్తులేసుకుంటున్నారు.. లోలోపల పథకాలు రచిస్తున్నారు.. ఇందులో భాగంగానే సీనియార్టీ పేరుతో ఎక్కడ తమకు పోటీకి వస్తాడోనన్న భయం వారిని వెన్నాడింది. అందుకే మొదట్లోనే తుంచేస్తే సరి అని పొన్నాలకు అసలు టిక్కెట్ రాకుండా ఎన్ని చేయాలో అన్ని చేశారు.. వారి ప్రయత్నాలు ఫలించినట్లే ఫలించి.. చివరి నిమిషంలో వికటించాయి.. ఎవరు గెలుస్తారో లేదో కూడా గ్యారెంటీ లేని టైమ్ లోనే ఇన్నేసి కుతంత్రాలు జరిగిన కాంగ్రెస్ పార్టీ రేపటి ఎన్నికల్లో అనుకోకుండా అధికారంలోకి వస్తే సిఎం సీటు కోసం ఎవరెన్ని ఫీట్లు చేస్తారో? పోటీ పడి ఎవరికి ఎర్త్ పెడతారో? తెలీదు కానీ.. మొత్తానికి పొన్నాల విజయం కాంగ్రెస్ పెద్దల్లో చాలా మందికి కునుకు లేకుండా చేస్తుందన్నది మాత్రం నిజం.

Tags:    

Similar News