బ్రీఫ్‌ డ్ మీ.. వాయిస్ చంద్ర‌బాబుదేన‌ట‌!

Update: 2017-03-06 10:36 GMT
తెలుగు రాష్ట్రాల మ‌ధ్యే కాకుండా ఏపీ - తెలంగాణ ముఖ్య‌మంత్రులు నారా చంద్ర‌బాబునాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల మ‌ధ్య తీవ్ర అగాథాన్నే సృష్టించిన ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు దోషిగా తేలిపోయారా?  సుప్రీంకోర్టులో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న విచార‌ణ‌లో చంద్రబాబు దోషిగా తేల‌డం ఖాయ‌మేనా?... అంటే అవున‌నే అంటున్నారు ఓ న్యాయ‌వాది. ఇదేదో స‌ద‌రు న్యాయ‌వాది అదాటుగా అంటున్న మాట ఎంత‌మాత్రం కాదు. కేసును పూర్తిగా స్ట‌డీ చేసిన ఆయ‌న చంద్ర‌బాబు దోషం ఉందంటూ ప‌క్కా ఆధారాల‌ను కూడా ఆయ‌న బ‌య‌ట‌పెట్టేశారు. నేటి ఉద‌యం సుప్రీంకోర్టు... ఓటుకు నోటు కేసు విచార‌ణ‌ను చేప‌డుతున్న‌ట్లు ప్రక‌టించిన వెంట‌నే.. పిటిష‌న‌ర్ - వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి త‌ర‌ఫున సుప్రీంకోర్టులో వాద‌న‌లు వినిపించిన ప్ర‌ముక న్యాయ‌వాది పొన్న‌వోలు సుధాక‌ర్ రెడ్డి ఓ తెలుగు మీడియా ఛానెల్ లో ఢిల్లీ నుంచే మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుపై కీల‌క వ్యాఖ్య‌లు చేసిన పొన్న‌వోలు... ఈ కేసులో చంద్ర‌బాబు దోషిగా తేల‌డం ఖాయ‌మేన‌ని చెప్పారు. ఇందుకు గ‌ల కార‌ణాలు, ఆధారాల‌ను ప్ర‌స్తావించిన ఆయ‌న‌... తెలంగాణ అసెంబ్లీ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్స‌న్‌ తో టీ టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడిన చంద్ర‌బాబు మ‌న‌వాళ్లు బ్రీఫ్‌ డ్ మీ. అన్నీ మేం చూసుకుంటాం అని వ్యాఖ్యానించారు. తాము ప్ర‌తిపాదించిన మేర‌కు త‌మ పార్టీ అభ్య‌ర్థికి ఓటేస్తే... అన్నీ చూసుకుంటామ‌ని నాడు స్టీఫెన్స‌న్‌కు చంద్ర‌బాబు భ‌రోసా ఇచ్చిన‌ట్లుగా తెలంగాణ ఏసీబీ... కోర్టులో దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ లో పేర్కొంది. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన పొన్న‌వోలు... అస‌లు ఆ ఫోన్ సంభాష‌ణ‌లో వినిపించిన వాయిస్ చంద్ర‌బాబుదేనా అన్న విష‌యాన్ని నిర్ధారించుకునే క్ర‌మంలో విచార‌ణాధికారులు... స‌ద‌రు వాయిస్ శాంపిళ్ల‌ను ముంబైలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి ప‌రీక్ష చేయించార‌న్నారు.

ఈ ప‌రీక్ష‌ల‌కు చంద్ర‌బాబు గ‌తంలో ఎక‌న‌మిక్ ఫోరంలో చేసిన ప్ర‌సంగాన్ని ఆధారంగా తీసుకున్నారని చెప్పారు. ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల్లో బ్రీఫ్‌ డ్ మీ వాయిస్ చంద్ర‌బాబుదేన‌ని తేలిపోయింద‌ని పొన్న‌వోలు తెలిపారు. అదే స‌మ‌యంలో ఈ కేసును స‌మ‌గ్రంగా విచారించేందుకు కూడా సుప్రీంకోర్టు అంగీక‌రించింద‌ని, ఆ క్ర‌మంలో వీల‌యినంత త్వర‌గా స్పందించాలంటూ చంద్ర‌బాబుకు నోటీసులు జారీ చేసింద‌ని ఆయ‌న చెప్పారు. విచార‌ణలో భాగంగా చంద్ర‌బాబు సుప్రీంకోర్టు బోనులో నిల‌బ‌డ‌క త‌ప్ప‌ద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News