మోడీకి గిప్ట్‌ గా న‌యీం హ‌త్య‌

Update: 2016-08-14 08:56 GMT
గ్యాంగ్‌ స్టార్ న‌యీం ఎపిసోడ్‌ లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి సంబంధం ఉందా? ఆయ‌న గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్నపుడు జ‌రిగిన ఎన్‌ కౌంటర్ల వెనుక న‌యీం ఉన్నాడా?  మోడీ తెలంగాణ‌ ప‌ర్య‌ట‌నకు న‌యీం ఎన్‌ కౌంట‌ర్‌ కు సంబంధం ఉందా? అనే సందేహాలను వామ‌ప‌క్ష పార్టీ వ్య‌క్తం చేస్తోంది.

దివంగ‌త సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మొదలు ఇప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరకు నయీంతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోట్రు రంగారావు ఆరోపించారు. ఈ నేపధ్యంలో అసలు నింధితుల వివరాలు ప్రజలకు తెలియాలంటే నయీం ఎన్‌ కౌంటర్‌ పై జ్యూడీషియర్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నలుగురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతోనే నయీం ఈ స్థాయికి చేరాడని, ఎక్కడ వాస్తవాలు బయటపడతోయోననే భయంతో బూటకపు ఎన్‌ కౌంటర్‌ కు పాల్పడ్డారని ఆరోపించారు. సాక్షాత్తు దేశప్రధాని పర్యటన సమయంలో నయీం హత్య జరగడం పలు అనుమానాలకు దారితీసిందన్నారు. గుజరాత్‌ హోంమినిష్టర్‌ పాండే, సొహ్రబుద్దీన్‌ హత్యా సంఘటనలో నయీం పాత్ర ఉన్నట్లు ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఆయన్ను హతమార్చి అతని శవాన్ని మోడికి బహుమతిగా ఇచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. నయీం హత్య అనంతరం వస్తున్న పత్రికా కథనాలు చూస్తుంటే క్రైం స్టోరీలను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వానికి సమాంతర పాలన నడిపించిన నయీం ఎదుగుదల వెనుక ముఖ్యమంత్రులు - మంత్రులు - పోలీస్‌ ఉన్నతాధికారులు - ఐఏఎస్‌ ల ప్రమేయం ఉందని, అతని నివాసాల్లో లభించిన సొమ్ముకు నిజమైన హక్కుదారులు వీళ్ళేనని, నయీం కేవలం వాళ్ళ బినామీగా పనిచేసినట్లు వార్తలు వినవస్తున్నాయని రంగారావు ఆరోపించారు. ఈ నేపధ్యంలో సాగుతున్న సిట్‌ విచారణ ప్రజామోదంగా లేదన్నారు. ఉద్దేశ పూర్వకంగానే నయూమ్‌ ను హతమార్చి అసలు నింధితులు తప్పించుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ పాలకుల్లో సగం మందికి నయూమ్‌ తో సంబంధాలు ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయన్నారు. విచారణ జరుగుతున్న క్రమంలో పోలీసుల అన్వేషణలో వెలుగులోకి వచ్చిన నయీం ముఠా ఎంతమంది, ఆయన ఎంతమందికి ఉపయోగపడ్డారు, ఆయనతో ఎవరెవరు ఏఏ పనిచేయించారో మొత్తం జాబితా అరమరికలు లేకుండా బహిరంగ పరచాలని డిమాండ్‌ చేశారు.
Tags:    

Similar News