పుకార్ల‌ను న‌మ్మిన‌ట్టుగా.. నిజాల‌ను న‌మ్మ‌ని భార‌తీయులు!

Update: 2020-03-07 05:02 GMT
క‌రోనా వైర‌స్ గురించి అనేక ర‌కాల అపోహ‌లు ప్ర‌జ‌ల్లో నెల‌కొని ఉన్నాయి. చైనా నుంచి విస్త‌రించిన ఈ వైర‌స్ ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కూ పెద్ద ప్ర‌భావం అయితే చూప‌లేదు. కానీ ప్ర‌జ‌లు ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకుంటూ ఉన్నారు. ఇది మంచిదే. మాస్క్ లు వేసుకోవ‌డం, జ‌లుబు చేస్తే కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం, వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డం.. ఇవ‌న్నీ మంచిదే. శుచి శుభ్ర‌త పాటించ‌డం, స‌మూహాల్లోకి ఎక్కువ‌గా వెళ్ల‌క‌పోవ‌డం, వెళ్లినా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం.. ఇవ‌న్నీ మంచిదే.

కరోనా వైర‌స్ నేప‌థ్యం లో ప్ర‌జ‌లు ఇలాంటి ముంద‌స్తు ర‌క్ష‌ణా చ‌ర్య‌లు తీసుకోవ‌డం ఆహ్వానించ‌ద‌గిన అంశ‌మే. అయితే క‌రోనా విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌చారానికి వెళ్లిపోయిన కొన్ని అపోహ‌లు మాత్రం కొన్ని మార్కెట్ ల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తూ ఉన్నాయి. అందులో ఒక‌టి చికెన్ తింటే క‌రోనా వ‌స్తుంద‌నేది.

ఇప్ప‌టికే ఈ విష‌యంలో చాలా చ‌ర్చ జ‌రిగింది. క‌రోనా వైర‌స్ కూ చికెన్ కు సంబంధం లేని ప‌లువురు ప‌రిశోధ‌కులు ప్ర‌క‌టించారు. చికెన్ తింటే క‌రోనా రాద‌ని వారు చెబుతున్నారు. ఈ విష‌యంలో ప్ర‌భుత్వాలు కూడా బాధ్య‌త తీసుకున్నాయి. చికెన్ తిన‌డం వ‌ల్ల క‌రోనా రాద‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఒక చికెన్ ఫెస్టివ‌ల్ ను కూడా నిర్వ‌హించింది. గ‌మ‌నించాల్సిన అంశం ఏమిటంటే.. ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు ఆ విష‌యంలో భ‌యాందోళ‌న‌లు త‌గ్గ‌క‌పోవ‌డం.

పౌల్ట్రీ మార్కెట్ పూర్తిగా ప‌డిపోయిన వైనాన్ని గ‌మ‌నిస్తే ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. గ్రామీణ ప్రాంతాల్లో, ఓ మోస్త‌రు ప‌ట్ట‌ణాల్లో చికెన్ తిన‌డం బాగా త‌గ్గిపోయిన‌ట్టుగా ఉంది. ఆ ప్రాంతాల్లో కిలో చికెన్ వంద రూపాయ‌ల లోపు ధ‌ర‌కే ఇస్తున్నా.. జ‌నాలు ముందుకు రావ‌డం లేద‌ట‌. న‌గ‌రాల్లో చికెన్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డం లేదు కానీ, బార్ ల‌లోనూ, ప‌బ్ ల‌లో కూడా చికెన్ వినియోగం బాగా త‌గ్గిపోయింద‌ట‌!

ఎంత‌లా అంటే.. 70 శాతం మంది చికెన్ తిన‌డానికి జంకుతున్నార‌ని పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు అంటున్నాయి. దీంతో పౌల్ట్రీ ఇండ‌స్ట్రీ బాగా న‌ష్టాల్లోకి ప‌డిపోతోంద‌ని ఆ వ‌ర్గాలు చెబుతున్నారు. ఆఖ‌రికి పౌల్ట్రీల్లో కూలి ప‌నులు చేసే వారికి కూడా జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి రాబోతోంద‌ని వారు చెబుతున్నారు. చికెన్ కు క‌రోనాకు సంబంధం ఉంద‌నే అపోహ ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్లిపోవ‌డంతో ఈ ప‌రిస్థితి తలెత్తింద‌ని వారు అంటున్నారు. ఈ విష‌యంలో ప్ర‌జ‌ల‌ను అవ‌గాహ‌న వంతుల‌ను చేసే ప్ర‌య‌త్నాల‌కు కూడా ఫ‌లితం ద‌క్క‌డం లేన‌ట్టుగా ఉంద‌ని.. పౌల్ట్రీ వ‌ర్గాల బాధ‌ను ప‌రిశీలిస్తే అర్థం అవుతుంది!
Tags:    

Similar News