ప్ర‌త్యేక హోదాపై కేంద్ర మంత్రి షాకింగ్ ప్ర‌శ్న‌

Update: 2016-06-06 15:52 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదాపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం త‌న వైఖ‌రిని సంద‌ర్భానుసారం చాటుకుంటోంది. ప్ర‌త్యేక హోదా ప‌రిశీలన‌లో ఉంద‌ని ఒక సారి..అమ‌లు చేయ‌డం క‌ష్ట‌మ‌ని మ‌రోసారి చెప్తున్న కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు కొత్త ప‌ల్ల‌వి అందుకుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ప‌ర్య‌టిస్తున్న కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇందులో భాగంగా ప్రత్యేకహోదా అనే అంశం ఆ చట్టంలో లేనేలేదని తేల్చిచెప్పారు.

ఆంధ్ర‌ప్రదేశ్‌ ప్రగతి కోసం కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తోందని జ‌వదేక‌ర్ తెలిపారు. ఇప్పటికే పలు ఇరిగేషన్ ప్రాజెక్టులను - విద్యాసంస్థలను మంజూరు చేశామని అన్నారు. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని పేర్కొన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా గురించి రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌ర్చ‌లేద‌ని జ‌వ‌దేక‌ర్‌ తేల్చిచెప్పారు. ఇక త‌మ ప్ర‌భుత్వం గురించి ఆయ‌న స్పందిస్తూ యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని కానీ అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని  కొనియాడారు. సామాన్యుల సంక్షేమానికి ప్ర‌ధాన‌మంత్రి ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను తీసుకువ‌చ్చార‌ని చెప్పారు.

2014 ఎన్నిక‌ల పొత్తు కుదుర్చుకునే స‌మ‌యంలో బీజేపీ ప్ర‌తినిధులుగా వారిలో ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ ఒక‌రు. ఆ ఒప్పందం స‌మ‌యంలో బీజేపీకి చెందిన కొంద‌రు నేత‌లు వ్య‌తిరేకించిన‌ప్ప‌టికీ జ‌వ‌దేక‌ర్ క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించి పొత్తులు కుదిర్చారు. దీంతోపాటు ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ ఆయ‌న విభ‌జ‌న‌పై త‌మ వాద‌న వినిపించారు.
Tags:    

Similar News