ఆ ప‌ని చేసి విమ‌ర్శ‌ల‌పాలైన ప్ర‌కాష్ రాజ్!

Update: 2018-05-14 16:22 GMT
క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేష్ దారుణ హ‌త్య అనంత‌రం బీజేపీ - ప్ర‌ధాని మోదీపై విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ విరుచుకుప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. జ‌స్ట్ ఆస్కింగ్ పేరుతో ప్ర‌ధాని మోదీని - బీజేపీ నేత‌ల‌ను ఇరుకున పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ముగిసిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా బీజేపీ - జేడీఎస్ ల‌పై ప్ర‌కాష్ రాజ్ మండిప‌డ్డారు. ఆ పార్టీకి ఓటు వేయ‌వ‌ద్దంటూ సోష‌ల్ మీడియాలో ముమ్మరంగా ప్ర‌చారం చేశారు. మోదీ - షా - యడ్యూరప్పపై నిప్పులు చెరిగారు. స్వ‌త‌హాగా క‌న్న‌డిగుడైన ప్ర‌కాష్ రాజ్ కు త‌న సొంత రాష్ట్రంలో మంచి ప‌ట్టు ఉండ‌డంతో కర్ణాటక రాజకీయ పరిణామాలపై జాతీయ మీడియా నిర్వ‌హించిన చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. దాదాపుగా కాంగ్రెస్ కు అనుకూలంగా, బీజేపీకి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టి వైర‌ల్ చేశారు. అయితే, ఇంత చేసిన ప్ర‌కాష్ రాజ్ ...ఆ ఎన్నిక‌ల్లో ఓటువేయ‌క‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

వృత్తి రీత్యా న‌టుడైన ప్ర‌కాష్ రాజ్ కొద్ది సంవ‌త్స‌రాలుగా చెన్నైలో స్థిర‌ప‌డ్డారు. దీంతో, క‌ర్ణాట‌క‌లోని త‌న ఓటు హ‌క్కును కూడా చెన్నైకు మార్పించుకున్నారు. దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓటువేయ‌లేదు. ప్ర‌కాష్ రాజ్ తో పాటు కాంగ్రెస్ మాజీ ఎంపీ, నటి రమ్య కూడా ఈ జాబితాలో ఉన్నార‌ట‌. అయితే, క‌ర్ణాట‌క‌లో ఓటు హక్కు ఉండి కూడా రమ్య ఓటేయలేద‌ని తెలుస్తోంది. కాంగ్రెస్ త‌ర‌ఫున ముమ్మ‌రంగా ప్ర‌చారం చేసిన రమ్య ...ఓటుహ‌క్కును వినియోగించుకోక‌పోవడం పై బీజేపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇంత‌టి బాధ్య‌త ఉన్న ర‌మ్య‌....బీజేపీని విమ‌ర్శిస్తోంద‌ని ప‌లువురు బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. అంతేకాకుండా, క‌న్న‌డిగుడైన ప్ర‌కాష్ రాజ్ ఇక్క‌డ ఓటు వేయ‌కుండా త‌మిళ‌నాడుకు ఓటును మార్చుకోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.
Tags:    

Similar News