ప్రశాంత్ కిషోర్ పరువు తీసిన సీనియర్ కాంగ్రెస్ లీడర్స్

Update: 2021-09-02 11:30 GMT
ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా ప్ర‌శాంత్ కిషోర్ (పీకే)కు దేశ‌మంతా ప్ర‌ముఖ పేరుంది. ఆయ‌నతో క‌లిసి ప‌నిచేయ‌డానికి పార్టీలు ఎదురు చూస్తాయి. ఆయ‌న‌తో క‌లిస్తే అధికారం ద‌క్కే అవ‌కాశముంద‌ని పార్టీలు భావిస్తాయి. ఆయ‌న కూడా త‌న రాజ‌కీయ చాణ‌క్యంతో వివిధ రాష్ట్రాల్లో పార్టీల‌ను గెలిపించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అంత‌టి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ చేర‌తానంటే మాత్రం ఆ పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు వ‌ద్దే వ‌ద్దని అంటున్నారు. పీకేని పార్టీలో చేర్చుకోవ‌డానికి స‌సేమీరా ఒప్పుకునేది లేద‌ని అధినేత్రి సోనియా గాంధీకి స్ప‌ష్టం చేశారు. దీంతో దేశ‌వ్యాప్తంగా వివిధ పార్టీలు త‌న వ్యూహాల కోసం ఎదురుచూస్తుంటే కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్న పీకేకు ఇది అవ‌మాన‌మేన‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.

2014 ఎన్నిక‌ల్లో కేంద్రంలో బీజేపీ స‌ర్కారు కొలువు దీర‌డంతో మోడీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించిన పీకే పేరు ఒక్క‌సారిగా దేశంలో మార్మోగింది. ఆ త‌ర్వాత యూపీ, బిహార్‌, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో త‌న వ్యూహాలు స‌క్స‌కె కాలేక‌పోయాయి. అయినా ఏపీలో జ‌గ‌న్‌ను, ప‌శ్చిమ బెంగాల్లో మ‌మ‌త‌ను, త‌మిళ‌నాడులో స్టాలిన్‌ల‌ను గ‌ద్దెనెక్కించ‌డం ద్వారా త‌న స‌త్తా మ‌రోసారి చాటుకున్నాడు. ఇప్పుడిక ఆయ‌న దృష్టి కాంగ్రెస్ మీద ప‌డింది. గ‌తంలో బీజేపీ లాంటి జాతీయ పార్టీతో పాటు వైసీపీ, డీఎంకే, టీఎంసీ లాంటి ప్రాంతీయ పార్టీల‌తో ప‌నిచేసిన ఆయ‌న‌పై ఓడిపోయే పార్టీల‌ను ప‌ట్టించుకోర‌నే చెడ్డ‌పేరు ఉంది. కాబ‌ట్టి దాన్ని చెరిపేసుకునేందుకు కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావాల‌ని పీకే నిర్ణ‌యించుకున్నారు. అందుకే ఆ పార్టీలో చేరాల‌ని ఆయ‌న భావిస్తున్నారు.

మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో తిరిగి కేంద్రంలో అధికారం ద‌క్కించుకోవాల‌ని చూస్తున్న కాంగ్రెస్ కూడా పీకేను చేర్చుకోవాల‌నే ఆలోచ‌న‌లోనే ఉంది. అలాంటి వ్యూహ‌క‌ర్త‌ను పార్టీలో చేర్చుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం దోహ‌ద‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని పార్టీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే విష‌యంపై ఆలోచిస్తున్న పీకే.. పార్టీలో ప్రాధాన్య‌త ద‌క్కాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో సోనియాక రాజ‌కీయ కార్య‌ద‌ర్శిగా, పార్టీ వ్యూహ‌క‌ర్త‌గా ఉన్న దివంగ‌త నేత అహ్మ‌ద్ ప‌టేల్ స్థానం త‌న‌కు ఇవ్వాల‌ని పీకే కోరుతున్న‌ట్లు స‌మాచారం. ఆ హోదా కల్పిస్తే వెంట‌నే పార్టీలో చేర‌తాన‌ని ఆయ‌న చెప్పిన‌ట్లు తెలిసింది. కానీ ఆయ‌న‌కు ఆ స్థానం ద‌క్క‌పోవ‌చ్చ‌ని కాంగ్రెస్‌లోని మెజార్టీ వ‌ర్గం అభిప్రాయ‌ప‌డుతోంది.

కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులైతే అస‌లు పీకేను పార్టీలో చేర్చుకోవ‌ద్ద‌ని సోనియాను కోరుతున్నారు. ఆయన‌పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో పీకేపై త‌మ అభ్యంత‌రాల‌ను సోనియాగాంధీకి వీళ్లు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పార్టీలో స‌మూల ప్ర‌క్షాళ‌న చేయాల‌ని గ‌తేడాది సోనియాకు లేఖ రాసిన జీ-23 నేత‌లు పీకే చేరిక‌ను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటీవ‌ల వీళ్లంద‌రూ మాజీ మంత్రి క‌పిల్ సిబ‌ల్ నివాసంలో స‌మావేశ‌మై ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే పీకేతో క‌లిసి ప‌నిచేసేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని స‌మాచారం. 2017 యూపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో పీకేతో క‌లిసి వీళ్లిద్ద‌రూ ప‌నిచేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో స‌మాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌కు ఆశించిన ఫ‌లితాలు ద‌క్క‌లేదు. దీంతో పీకే కొన్ని సంద‌ర్భాల్లో మాత్ర‌మే స‌క్సెస్ అవుతున్నార‌ని కొంద‌రు నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి పీకేను చేర్చుకోవాలా? వ‌ద్దా? అని విష‌యంపై సోనియా గాంధీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌నే ఆస‌క్తి రేకెత్తుతోంది.


Tags:    

Similar News