జగన్‌ కు ఇచ్చిన పీకే నివేదికలో ఏముందంటే.?

Update: 2019-04-13 08:17 GMT
ప్రశాంత్‌ కిశోర్‌.. ఈ పేరు సామాన్య జనానికి పెద్దగా తెలియకపోవచ్చు గానీ, ప్రతి రాజకీయ నాయకుడికి ఆయన సుపరిచితమే. ఎన్నికల వ్యూహకర్తగా.. ఐ ప్యాక్‌ సంస్థ అధినేతగా చెలామణి అవుతున్న ఆయన వ్యూహం వేస్తే ఆ రాజకీయ పార్టీ గెలుస్తుందనే నమ్మకం అన్ని పార్టీల నాయకుల్లో ముద్రపడింది. ఎక్కువగా కాంగ్రెస్‌ నాయకులు ఆయనను నియమించుకొని గెలుపు వ్యూహాలు రచిస్తారు. 2014 ఎన్నికల్లో ఆయన బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడానికి వ్యూహం పన్ని ఆ పార్టీకి విజయం కట్టబెట్టారు. ఈసారి ఆయన ఒక్క వైసీపీకి మాత్రమే సలహాదారుడిగా పనిచేశాడు. ప్రస్తుతం ఆయన బీహార్‌లోని ఆర్‌జేడీ పార్టీలో కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ సీట్లు రావడానికి ఎంతో కృషి చేశారట..!

ఏపీలో పోలింగ్‌ పూర్తి కాగానే వైసీపీ అధినేత జగన్‌.. ప్రశాంత్‌ కిశోర్‌ను కలిశారు. ఎన్నికల సరళిపై కాసేపు మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌కు జగన్‌ ప్రత్యేకంగా 'ధన్యవాదాలు' అని చెప్పారు. ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకొని వారి బృందంతో గడిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ కిశోర్‌ జగన్‌తో పలు విషయాలు చర్చించినట్లు సమాచారం.

ఎన్నికల తరువాత ప్రశాంత్‌ కిశోర్‌  బృందం సర్వే జరిపింది. ఈ సర్వేలో వైసీపీ 125 స్థానాల్లో రాబోతుందని జగన్‌కు చెప్పారని సమాచారం. పార్లమెంట్‌లో 20 స్థానాలు గెలుస్తారని వివరించారట. చంద్రబాబు ఐదేళ్లలో అన్నీ చేశానని అబద్దాలు ఆడారని, దీంతో ప్రజలు ఆయనను నమ్మలేకపోయారని చెప్పారు. వైసీపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి జరగొచ్చు అనే అంచనాతో ప్రజలు ఓటేయడానికి వచ్చారని తేల్చారు.

గత ఎన్నికల్లో వైసీపీ పోటాపోటీగా సీట్లు గెలుచుకున్నా కోస్తాంధ్రలో సీట్లు రాబట్టుకోలేకపోయింది. అయితే ఈసారి ఉత్తరాంధ్రలో సీట్లు వస్తాయి గానీ.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మాత్రం పవన్‌ ప్రభంజనం ఉంటుందన్నారు. విశాఖ జిల్లాలోని గాజువాక, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో పవన్‌ గెలుస్తాడని ప్రశాంత్‌ నివేదికనిచ్చారు. కాపు సామాజిక ఓట్లు పవన్‌కే ఎక్కువగా పడ్డాయని, ఆయా జిల్లాలో టీడీపీకి  మూడు లేదా నాలుగు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పారు. ఈ నివేదికతో జగన్‌ సంతృప్తి చెందినట్లు సమాచారం.


Tags:    

Similar News