బీఆర్ ఎస్ కార్పొరేట‌ర్లు అరెస్టు.. జీహెచ్ ఎంసీ మీటింగ్ ర‌సాభాస‌

గ్రేట‌ర్‌హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ బ‌డ్జెట్ స‌మావేశాలు ర‌సాభాస‌గా మారాయి.

Update: 2025-01-30 09:02 GMT

గ్రేట‌ర్‌హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ బ‌డ్జెట్ స‌మావేశాలు ర‌సాభాస‌గా మారాయి. ఈ రోజు ఉద‌యం కౌన్సిల్ ప్రారంభం కాగానే బ‌డ్జెట్‌పై మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి ప్ర‌క‌ట‌న చేశారు. ఈ సంద‌ర్భంగా విప‌క్ష బీఆర్ ఎస్ స‌భ్యులు.. స‌మ‌స్య‌ల‌పై ప్ర‌స్తావించాల‌ని డిమాండ్ చేశారు. ప‌దే ప‌దే త‌మ స్థానాల్లో నిల‌బ‌డి మేయ‌ర్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డం కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ముందు చ‌ర్చించాలని ప‌ట్టుబ‌ట్టారు.

దీంతో తొలుత కొద్ది సేపు మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి కౌన్సిల్‌ను వాయిదా వేశారు. త‌ర్వాత స‌మావేశ‌మైన‌ప్ప‌టికీ ప‌రిస్థితిలో ఏమాత్రం మార్పు రాక‌పోగా.. బీఆర్ ఎస్ - కాంగ్రెస్ స‌భ్యుల మ‌ధ్య మ‌రింత వివాదం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో బీఆర్ ఎస్ స‌భ్యులు మేయ‌ర్ పోడియంను చుట్టుముట్టి ఆమెకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్ర‌హించిన మేయ‌ర్‌.. బీఆర్ ఎస్ స‌భ్యుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వీరిని కాంగ్రెస్ కార్పొరేట‌ర్లు అడ్డుకున్నారు. ఈ స‌మ‌యంలో స్వ‌ల్ప తోటులాట కూడా చోటు చేసుకుంది.

ఈ నేప‌థ్యంలో బీఆర్ ఎస్ స‌భ్యుల‌ను మేయ‌ర్ స‌స్పెండ్ చేశారు. కౌన్సిల్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లాల‌ని వారిని గ‌ద్దించారు. అయితే.. స‌భ్యులు బ‌య‌ట‌కు వెళ్లేందుకు స‌సేమిరా అన‌డంతో పాటు బైఠాయించారు. ఈ క్ర‌మంలో మ‌రోసారి కాంగ్రెస్, బీఆర్ ఎస్‌ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు దుర్భాషలాడుకున్నారు. మేయర్ పోడియంపైకి బీఆర్‌ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరి కొట్టారు. దీంతో మేయ‌ర్ మార్ష‌ల్స్‌ను రంగంలోకి దింప‌డంతో వారు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు. అక్క‌డ నుంచి బ‌ల‌వంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Tags:    

Similar News