సీఎం మీద పోటీ చేస్తున్న ఆమె ఆస్తి రూ.1200!

Update: 2018-11-07 05:27 GMT
కొంద‌రి ధైర్యం.. ఆత్మ‌విశ్వాసం ముచ్చ‌ట వేసేలా ఉంటాయి. అలాంటి ఉదంతం ఒక‌టి తాజాగా ఛ‌త్తీస్ గ‌ఢ్ ఎన్నిక‌ల్లో క‌నిపిస్తోంది. ఇవాల్టి రోజున ఎన్నిక‌ల బ‌రిలో నిలిచే అభ్య‌ర్థుల ఆస్తుల గురించి ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అధికారికంగానే కోట్ల రూపాయిల్ని చూపిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా బ‌రిలోకి దిగిన ఒక మ‌హిళ ఉదంతం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది.

ఇవాల్టి రోజున సినిమా కోసం ఒక కుటుంబం మ‌ల్టీఫ్లెక్సుకు వెళితే అయ్యే ఖ‌ర్చు కంటే త‌క్కువ ఆస్తి ఉన్న ఒక మ‌హిళ ఎన్నిక‌ల బ‌రిలో ఇండిపెండెంట్ గా దిగ‌టం ఒక ఎత్తు అయితే..ఆమె ఆస్తి విలువ తెలిసిన వారంతా ఆమె మ‌నో ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అభినందిస్తున్నారు. ఇంత‌కీ ఆమెను అంత‌లా పొగ‌డ‌టానికి కార‌ణం ఆమె పోటీ ప‌డుతోంది ఎవ‌రితోనో కాదు.. ఏకంగా ఆ రాష్ట్ర సీఎంతోనే కావ‌టం విశేషం.

ఛ‌త్తీస్ గ‌ఢ్ ముఖ్య‌మంత్రి ర‌మ‌ణ్ సింగ్ మీద ఒక సామాన్యురాలు ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. బీజేపీ అభ్య‌ర్థిగా ముఖ్య‌మంత్రి అయిన ర‌మ‌ణ్ సింగ్‌.. కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా దివంగ‌త మాజీ ప్ర‌ధాని వాజ్ పేయ్ కోడ‌లు క‌రుణా శుక్లాలు పోటీ ప‌డుతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య పోటీనే భారీగా ఉంది. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఒక నిరుపేద మ‌హిళ తాజాగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. 37 ఏళ్ల ప్ర‌తిమా వాస్నిక్ అనే మ‌హిళ ఒక‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల గోదాలోకి దిగారు. నామినేషన్ ప‌త్రంలో ఆమె త‌న అధికారిక ఆస్తి విలువ రూ.1200గా పేర్కొన్నారు. త‌న ద‌గ్గ‌ర ఎన్నిక‌ల ఫండ్ రూ.20వేల‌కు మించి ఒక్క పైసా కూడా లేద‌ని వెల్ల‌డించారు. ఆమె భ‌ర్త స్థానికంగా ఉండే ఒక హోట‌ల్లో వంట‌వాడిగా ప‌ని చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. నామినేష‌న్లో ప్ర‌తిమా పేర్కొన్న దాని ప్ర‌కారం ఆమె ఆస్తి కేవ‌లం రూ.12వంద‌లు మాత్ర‌మే. స‌మాజంలో మార్పు ల‌క్ష్యంగా ఆమె ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ట్లుగా చెబుతున్నారు.
త‌న ద‌గ్గ‌ర ఎన్నిక‌ల ప్ర‌చారానికి త‌గినంత నిధులు లేక‌పోవ‌టంతో ఆమె ఇంటింటికి తిరుగుతూ ప్ర‌చారం చేస్తున్నారు. రోడ్లు.. నీటి స‌ర‌ఫ‌రా.. విద్యుత్ సౌక‌ర్యాలు మెరుగుప‌ర్చాల‌న్న హామీల‌తో పాటు.. ఎస్సీ..ఎస్టీ.. ఓబీసీల‌కు గుర్తింపు ల‌భించాల‌ని.. ప్రైవేటు రంగంలో రిజ‌ర్వేష‌న్ల సాధ‌నే ల‌క్ష్యంగా ఆమె బ‌రిలోకి నిలిచిన‌ట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News