ప్రవీణ్ వర్సెస్ బండి.. తప్పు ఎవరిది? మనం రియాక్టు కావాలా?

Update: 2021-03-18 05:30 GMT
ఎవరి నమ్మకాలు వారివి.  ఫలానా వాళ్లను నమ్మనంటే ఆ విషయాన్ని అవతల వారి మనోభావాల్ని దెబ్బ తీసేలా చెప్పాల్సిన అవసరం ఉందా? అందునా బాధ్యత కలిగిన స్థానంలో ఉన్న వారు అంత ఉత్సాహాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఏమిటి? తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  తెలంగాణ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హుజూర్ నగర్ లో స్వేరోస్.. జైభీం కార్యకర్తలు ఆయన కాన్వాయ్ పైన దాడికి దిగారు.

అసలు అలాంటి దాడి జరగలేదని పోలీసు అధికారులు చెబుతుంటే.. అక్కడి వారంతా మాత్రం రచ్చ రచ్చ జరిగినట్లుగా చెబుతున్నారు. మీడియాలోనూ అలాంటి వార్తలే వస్తున్నాయి. అసలు.. బండి సంజయ్ ఎందుకలా మాట్లాడాల్సి వచ్చింది. దానికి కారణం ప్రవీణ్ కుమార్ చేసిన పని కాదా? ఆయన చేసిన పనికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హిందూ దేవుళ్లను నమ్మమని.. ఇంకా పలు మాటలతో కూడిన ప్రతిజ్ఝ చేయాల్సిన అవసరం ఏమిటి? నమ్మకపోతే నమ్మకుండా ఉంటే సరిపోతుంది కదా? ఇప్పుడు అంబేడ్కర్ భావజాలం నచ్చలేదనుకోండి. అది వారి వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పటం తప్పు కాదు. కానీ.. దానికో వేదిక వేసి.. వందల మందిని పోగేసి.. నేను అంబేడ్కర్ ను  అభిమానించను. ఆయన వైపు చూడను. ఆయనను గౌరవించను.. లాంటి వ్యాఖ్యలతో కూడిన ప్రతిజ్ఝ చేస్తే ఎంత ఛండాలంగా ఉంటుంది.

భావస్వేచ్ఛ మంచిదే కానీ.. ఆ పేరుతో మిగిలిన వారి మనోభావాల్ని దెబ్బ తీయటం సరికాదు. ప్రవీణ్ కుమార్ బాధ్యత కలిగిన ఐపీఎస్ అధికారి. అలాంటి ఆయన.. ప్రతిజ్ఝ చేయిస్తున్న మందిలో నిలబడి.. చేయి ముందుకు జాచి మరీ చేసిన తర్వాత.. తాను ఎవరి మనోభావాలు దెబ్బ తీయలేదని చెబితే అదెలా కుదురుతుంది? ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగావిరుచుకుపడ్డారు.

ఇక్కడ బండి సంజయ్ వాడిన పదజాలాన్ని సమర్థించటం లేదు. కానీ.. సాపేక్షంగా చూస్తే.. బండి నోటికి పని కల్పించింది ప్రవీణ్ అండ్ కో వారే కదా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ రోజున హిందూ భావజాలం అంతకంతకూ తీవ్రమవుతుందని ఆందోళన చెందే వారంతా.. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ.. ప్రవీణ్ కుమార్ చేసిన పనే.. మరొకరు మరో అంశానికి చేసి ఉంటే.. ఈపాటికి చర్యలు ఉండేవి కావా? ఇదంతా చూసినప్పుడు విషయాల్ని సాపేక్షంగా చూసే తీరు లేకపోవటం.. ఎవరికి వారు.. తాము అభిమానించే వారికి మద్దతు పలకటమే తప్పించి.. మరింకేమీ ఉండట్లేదు. తాను మద్దతు పలికితే.. తమ వాడు ఏం చేసినా తప్పు కాదన్న ధోరణి సమాజంలో ఎవరికి మంచిది కాదన్నది గుర్తు పెట్టుకోవాలి.
Tags:    

Similar News