సీఎం జగన్ ముఖ్య కార్యదర్శి సంచలన నిర్ణయం?

Update: 2021-08-12 02:57 GMT
కీలక స్థానాల్లో ఉన్న అధికారులు తమ పదవులకు రాజీనామా చేయాలంటే ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. అందులోకి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్య కార్యదర్శిగా.. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అధికారులు అనూహ్యంగా తమ పదవికి రాజీనామా చేయటం సంచలనమే. ఇప్పుడు అలాంటి సంచలనమే చోటు చేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

సంచలనంగా మారిన ఈ నిర్ణయం వెనుక కారణం వ్యక్తిగతమని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. ఇటీవల కాలంలో దేశ రాజధాని ఢిల్లీకి తరచూ వెళుతున్న ఆయన.. ఏపీ ముఖ్య కార్యదర్శి హోదాను విడిచి పెట్టి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తన నిర్ణయాన్ని ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేశారని.. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తానని జగన్ చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆయన రాజీనామా త్వరలోనే ఉంటుందని చెబుతున్నారు. పదవికి గుడ్ బై చెప్పిన తర్వాత బీజేపీలో ఆయన చేరుతారని చెబుతున్నారు. మరికొద్ది నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నవారణాసి పార్లమెంట్ పరిధిలోని వారణాసి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

దీనికి బీజేపీ అధినాయకత్వం కూడా సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాశీ టికెట్ ను ఇచ్చేందుకు హామీ లభించినట్లుగా ప్రచారం జరుగుతోంది.దీంతో.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే నియోజకవర్గంలో పాగా వేయటం.. పట్టు పెంచుకోవటం లాంటివి ఉండటంతో వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్న యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. వారం.. పది రోజుల్లోపు ఎప్పుడైనా తన నిర్ణయాన్ని ఆయన ప్రకటించే వీలుందన్న మాట వినిపిస్తోంది.

యూపీతో ప్రవీణ్ ప్రకాశ్ కు మంచి అనుబంధమే ఉంది. గతంలో స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా కాశీలో పని చేశారు. దీంతో..ఆయనకుమంచి పేరు ఉంది. ఈ కారణంతోనే కాశీని ఆయన తన రాజకీయ క్షేత్రంగా ఎంపిక చేసుకున్నట్లు చెబుతున్నారు. 1994 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా సుపరిచితుడైన ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటానికి ఆయన స్నేహితులు కూడా కారణమని చెబుతున్నారు. ఆయన బ్యాచ్ మేట్ అయిన అశ్వినీ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఉండటం తెలిసిందే. ఈ కారణంతోనే ఏపీలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. తన ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి.. రాజకీయాల్లోకి ఎంటర్ కావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఈ ప్రచారంపై ప్రవీణ్ ప్రకాశ్ ఏమంటారో చూడాలి.




Tags:    

Similar News