అసెంబ్లీ ర‌ద్దు త‌ర్వాత ఏం జ‌రుగుతుంది?

Update: 2018-09-06 05:08 GMT
ముంద‌స్తు దిశ‌గా అడుగులు వేయాల‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్లుగా ఇప్ప‌టివ‌ర‌కూ వ‌చ్చిన వార్త‌ల‌న్నీ అంచ‌నాలు మాత్ర‌మే. చివ‌రి నిమిషంలో అయినా కేసీఆర్ వెన‌క్కి త‌గ్గేందుకు అవ‌కాశాలు ఉన్నాయి. అయితే.. అవి చాలా చాలా త‌క్కువ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అయితే..అనూహ్య నిర్ణ‌యాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా చెప్పే కేసీఆర్ నిర్ణ‌యాల్ని ఊహించ‌టం. అంత తేలికైన విష‌యం కాదు. అయితే.. ముంద‌స్తు విష‌యంలో ఒక‌టి త‌ర్వాత ఒక‌టి చొప్పున ఇచ్చిన సంకేతాలు స్ప‌ష్టంగా ఉన్న నేప‌థ్యంలో స‌భ ర‌ద్దు నిర్ణ‌యాన్ని ఈ రోజు (గురువారం) ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ రోజు మ‌ధ్యాహ్నం మంత్రివ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించి.. అందులో ర‌ద్దు నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. మ‌రి.. అదే జ‌రిగితే ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ముంద‌స్తు నేప‌థ్యంలో అసెంబ్లీ ర‌ద్దుకు గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ.. స‌భ‌ను ర‌ద్దు చేయాల‌న్న సిఫార్సు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకున్న త‌ర్వాత సాంకేతికంగా ఏం జ‌రుగుతుంది?

గ‌వ‌ర్న‌ర్ స‌భ‌ను ర‌ద్దు చేసే క్ర‌మంలో సీఎం స‌భ ర‌ద్దు నిర్ణ‌యం అధికారికంగా ఎన్ని ద‌శ‌ల అనంత‌రం ప్ర‌భుత్వం ర‌ద్దు  చేసిన‌ట్లుగా ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌న్న విషయాన్ని చూస్తే..చాలా ప్రొసీజ‌ర్ ఉంటుంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అసెంబ్లీని ఎలా ర‌ద్దు చేస్తార‌న్న‌ది న్యాయ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం చూస్తే.. రెంఉ ప‌ద్ద‌తులు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

మొద‌టి ప‌ద్ద‌తిలో..

+  రాజ్యాంగంలోని 174 ఆర్టికల్‌ ప్రకారం.. రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ రద్దు చేస్తూ తీర్మానం చేస్తే - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. అసెంబ్లీ కార్యదర్శిని తన వద్దకు పిలిపించుకొని తీర్మానం కాపీని ఆయ‌న‌కు అందజేస్తారు.

+ మ‌రో మార్గంలో సాధారణ పరిపాలన శాఖ ప్రతినిధి ద్వారా తీర్మానం ప్రతిని అసెంబ్లీ కార్యదర్శికి అందిస్తారు.

+  శాసనసభను రద్దు చేస్తూ కేబినెట్‌ చేసిన తీర్మానం ప్రతి ఆధారంగా అసెంబ్లీ కార్యదర్శి ఫైల్‌ సిద్ధం చేస్తారు.

+  ఆ విష‌యాన్ని అసెంబ్లీ స్పీకర్‌ కు.. శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రికి పంపిస్తారు.

+  అనంత‌రం ఆ ఫైల్ ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు చేరుతుంది. ఆయ‌న దాన్ని ఓకే చేశాక గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు వెళుతుంది.

+  గ‌వ‌ర్న‌ర్ దానిపై ఆమోద ముద్ర వేసిన త‌ర్వాత తిరిగి ఆ ఫైల్ ను అసెంబ్లీ కార్య‌ద‌ర్శి వ‌ద్ద‌కు పంపుతారు

+  గ‌వ‌ర్న‌ర్ సంత‌కం పెట్టిన ఫైలు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన త‌ర్వాత అసెంబ్లీ కార్య‌ద‌ర్శి నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తారు.

+  అసెంబ్లీ ర‌ద్దు విష‌యాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టికి తీసుకెళ‌తారు.

రెండో ప‌ద్ద‌తిలో..

=   అసెంబ్లీ రద్దు చేస్తూ కేబినెట్‌ తీర్మానం ఆమోదించాక  దాని ప్రతిని ముఖ్యమంత్రి నేరుగా గవర్నర్‌ కు ఇవ్వొచ్చు.

=  అదే జ‌రిగితే.. త‌న‌కు అందిన అసెంబ్లీ ర‌ద్దు నిర్ణ‌య కాపీని శాస‌న స‌భ కార్య‌ద‌ర్శికి పంపుతారు.

=  ఆయ‌న ఫైల్ సిద్ధం చేసి అసెంబ్లీ స్పీక‌ర్.. శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల శాఖామంత్రి ఆమోదంతో సీఎంకు పంపుతారు

=   ముఖ్య‌మంత్రి దానిపై సంత‌కం పెట్టిన త‌ర్వాత ఆ ఫైల్ గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు చేరుతుంది.

=  గ‌వ‌ర్న‌ర్ ఆమోదం పొందిన త‌ర్వాత తిరిగి ఫైల్ అసెంబ్లీ కార్య‌ద‌ర్శి వ‌ద్ద‌కు చేరుంది.

=  అప్పుడు అసెంబ్లీ ర‌ద్దు అయిన‌ట్లుగా కార్య‌ద‌ర్శి నోటిఫికేష‌న్ జారీ చేస్తారు.

=  అదే విష‌యాన్ని ఎన్నిక‌ల సంఘానికి స‌మాచారం అందిస్తారు. ఆ త‌ర్వాత అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంటుంది.

ఈ రెండు ప‌ద్ద‌తుల్లో ఏది జ‌రిగినా.. ఒక‌సారి శాస‌న స‌భ ర‌ద్దు అయిన‌ట్లుగా అధికారికంగా నిర్ణ‌యం ప్ర‌క‌టించిన త‌ర్వాత కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కూ అప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోర‌తారు. అన్ని పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేలు తాజా మాజీలు అవుతారు. సీఎం.. మంత్రులు అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వంగా వ్య‌వ‌హ‌రిస్తారు.



Tags:    

Similar News