చివ‌రి ప్ర‌సంగం...ఒబామా ఉద్వేగం

Update: 2017-01-11 06:46 GMT
ఈ నెల 20న అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న  అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చికాగోలో వీడ్కోలు ప్రసంగం చేశారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున హాజ‌రైన త‌న‌ అభిమానులు, అమెరిక‌న్ల‌ను ఉద్దేశించి ఒకింత గ‌ద్గ‌ద స్వ‌రంలో ప్ర‌సంగించారు. 'గత ఎనిమిదేళ్ళ కాలంలో మనం అనేక సవాళ్ళను ఎదుర్కొన్నాం. విజయవంతంగా అధిగ మించాం. మరింత బలోపేతమయ్యాం. మనమందరం కలిసి ఈ దేశాన్ని మరింత మెరుగ్గా మార్చగలమన్న మన నమ్మకాన్ని, నిబద్ధతను కోల్పోలేదు. అదే మనను ముందుకు నడిపించింది' అని అని ఒబామా తన మద్దతుదారులతో అన్నారు.

చికాగో ప్ర‌జ‌ల నుంచి తాను రోజూ స్పూర్తి పొందుతూ ఉంటాన‌ని ఒబామా వ్యాఖ్యానించారు. ప్ర‌తిరోజూ తాను ఏదో ఒక కొత్త అంశాన్ని నేర్చుకుంటూనే ఉండే అవ‌కాశాన్ని దేశ ప్ర‌జలంతా క‌ల్పించార‌ని త‌ద్వారా తాను అత్యుత్త‌మ అధ్యక్షుడిగానే కాకుండా మంచి వ్య‌క్తిగా కూడా ఎదిగాన‌ని ఒబామా ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. ఒబామా వీడ్కోలు ప్రసంగానికి చికాగో నగరంలో గడ్డ కట్టించే చలిలో కూడా వేలాదిమంది ఆయన మద్దతుదారులు, ప్రజలు ఒబామా ప్రసంగం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆదివారం నాటికి ఆన్‌లైన్‌లో ఈ టిక్కెట్లను 5వేల డాలర్ల చొప్పున విక్రయించారు. గతంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన చోటుకు కొద్ది దూరంలోనే ఇప్పుడు ఒబామా వీడ్కోలు ప్రసంగం చేశారు. చికాగోకు ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో ఒబామా చేసే చివరి పర్యటన యాత్రలా సాగనుంది. ఒబామాతో పాటు ఆయన భార్య మిచెల్‌ ఒబామా, ఉపాధ్యక్షుడు జో బిడెన్‌, ఆయన భార్య జిల్‌ బిడెన్‌లు కూడా చికాగో వెళ్లారు. ట్రంప్‌ వ్యతిరేక ప్రసంగాన్ని ఒబామా చేయరని, దేశం ఇంకా ముందుకు సాగడానికి తనదైన దార్శనికతను వెల్లడించేలా ఆయన ప్రసంగం ఉందని ప‌లువురు పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు పదవి నుండి వైదొలగే ముందు ప్రధానమైన ప్రసంగం చేయడం 1796లో జార్జి వాషింగ్టన్‌ హయాం నుండి ఆరంభమైంది. తాము పదవిలో ఉన్న కాలంలో ఎదుర్కొన్న అనుభవాలు, సాధించిన విజయాలు, ఎదురు దెబ్బలను వెల్లడించడానికి అధ్యక్షులకు ఇదొక అవకాశం. ఎనిమిదేళ్ళ క్రితం అప్పటి అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌ వర్జీనియా యూనివర్శిటీలో ఇదే రకంగా ప్రసంగిస్తూ ఇరాక్‌ యుద్ధం వంటి వివాదాస్పద నిర్ణయాలను గట్టిగా సమర్ధించుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News