రోడ్డు ప్రమాదానికి గురైన ఉక్రెయిన్ అధ్యక్షుడు

Update: 2022-09-15 07:05 GMT
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే.. ఆందోళన చెందేంత పెద్ద గాయాలు కాలేదని చెబుతున్నా..ఈ ఉదంతంపై మాత్రం ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత రక్షణ ఉండే అధ్యక్షుడు ప్రయాణించే వాహనాన్ని ఎలా ఢీ కొడతారన్నది ప్రశ్నగా మారింది.

యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ పారిపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని కీవ్ లో జరిగిన ఈ ఉదంతంలో జెలెన్స్కీ ప్రయాణిస్తున్న వాహనాన్ని వాహనదారుడు తన కారుతో ఢీ కొట్టినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఈ ప్రమాదంలో అధ్యక్షుడికి పెద్దగా గాయాలు కాలేదన్న విషయాన్ని ఆయన ప్రతినిధులు ప్రకటించారు. కానీ.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం విడుదల కావాల్సి ఉంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పటికీ.. అధ్యక్షుల వారికి.. ఆయన డ్రైవర్ కు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని.. పెద్ద గాయాలు కాలేదని చెబుతున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రయాణిస్తున్న కారును.. పక్కనున్న కాన్వాయ్ ను ఎదురుగా వస్తున్న వాహనంతో ఢీ కొట్టి బీభత్సాన్ని క్రియేట్ చేశాడో వ్యక్తి. ప్రమాదానికి గురైన వెంటనే.. అంబులెన్స్ వచ్చి.. అధ్యక్షుడ్ని.. ఆయన డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు.

తీవ్ర గాయాలు కాలేవంటున్నారు. జెలెన్ స్కీ ఆరోగ్యంపై అధ్యక్ష కార్యాలయం పూర్తి స్థాయిలో హెల్త్ బులెటెన్ విడుదల చేయాల్సి ఉంది.ఇది అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదమా? లేదంటే కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్న అంశం తేలాల్సి ఉందని ఉక్రెయిన్ అధికార ప్రతినిధి సెర్గీ నికిఫోరోవ్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు.

ఎదురుగా వచ్చి ఢీ కొట్టిన వాహనాల్లోని వ్యక్తులు పరారు కావటంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన అంశం ఏమంటే.. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ వేళ.. రష్యా బలగాలు వెనక్కి మళ్లినట్లుగా జెలెన్ స్కీ ఒక వీడియోను పోస్టు చేసిన కాసేపటికే ఈ ప్రమాదం జరగటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News