ఉత్తరాఖండ్ ఎపిసోడ్ రాష్ట్రపతి పాలనకు చేరింది

Update: 2016-03-27 11:08 GMT
ఆ మధ్యన అరుణాచల్ ప్రదేశ్ లో అనూహ్యంగా అధికార బదిలీ చోటు చేసుకోవటం తెలిసిందే. సరిగ్గా అదే ఫార్ములాతో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్ లోనూ అధికార బదిలీ జరిగేలా ప్రయత్నాలు జరిగాయి. అనుకున్నట్లే అధికారపక్షానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తొమ్మది మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారటం.. వారికి విపక్ష బీజేపీ నేతల మద్ధతు లభించటంతో ప్రభుత్వం ఒక్కసారిగా మైనార్టీలో పడిపోయింది.

ఇదిలా ఉంటే.. తమకు బలం ఉందంటూ తిరుగుబాటు నేతలతో బీజేపీ పక్షం అధికార బదిలీకి ప్రయత్నాలు షురూ చేయటంతో అరుణాచల్ ప్రదేశ్ మాదిరే ఉత్తరాఖండ్ లోనూ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని భావించారు. అయితే.. అనూహ్యంగా స్పీకర్ ఇచ్చిన ట్విస్ట్ తో మొత్తం ఎపిసోడ్ మారిపోయింది.

ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్వాల్ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయటంతో దిక్కుతోచని స్థితిలో  హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఉపశమనం కలిగే తీర్పు రాకపోవటంతో బీజేపీ అలెర్ట్ అయ్యింది. ఈ ఇష్యూలో మరింత ముందుకు వెళితే ఎదురుదెబ్బలు తప్పవన్న విషయాన్ని గుర్తించిన కమలనాథులు తమ ప్రయత్నాల్ని నిలిపేశారు.

ఉత్తరాఖండ్ లో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. రాష్ట్రపతి పాలన నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో.. స్పందించిన రాష్ట్రపతి ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. ఉత్తరాఖండ్ ఎపిసోడ్ అధికార బదిలీ కోసం మొదలై.. చివరకు రాష్ట్రపతి పాలనతో ముగిసిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News