‘అమరావతి’లో ఆ స్వీట్ షాప్ స్పెషల్ స్వీట్ కేజీ ధర ఎంతో తెలుసా?

Update: 2021-11-03 01:30 GMT
కిలో స్వీట్ వెయ్యి. ఈ మాటకే తడారిపోతుంది. కాకుంటే హైదరాబాద్.. విశాఖ.. విజయవాడ లాంటి నగరాల్లో కేజీ స్వీట్ వెయ్యి దాటేసి.. రూ.1500 వరకు వచ్చేసిన రోజులు గతంలోనే వచ్చేశాయి. కొవిడ్ తర్వాత మారిన ధరలతో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు కేజీ స్వీట్ రూ.500 అంటేనే గుండెలు బాదుకునే పరిస్థితి. ఇప్పుడు అందుకు భిన్నంగా రేట్లు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక మిఠాయి షాపులో కేజీ స్వీట్ ఏకంగా రూ.11 వేలుగా ఫిక్స్ చేసి అమ్మేస్తున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ మిఠాయి దుకాణం ఎక్కడ ఉంది? ఆ స్వీట్ స్పెషల్ ఏమిటన్నది చూస్తే..

అమరావతి.. ఏపీలోని అమరావతి కాదులెండి. మహారాష్ట్రలోని అమరావతి నగరంలో ఒక స్వీట్ షాపులో ‘‘సువర్ణ కలశ్’’ పేరుతో సరికొత్త స్వీట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీపావళి సందర్భంగా తీసుకొచ్చిన ఈ మిఠాయి స్పెషల్ ఏమంటే.. దీనికి 24 క్యారెట్ల బంగారు పూతను అద్దుతున్నారు. దీని తయారీ కోసం రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా స్వీట్ మాస్టర్లను తీసుకొచ్చి మరీ తయారు చేయించారు.దీని ధర కేజీ రూ.11వేలుగా నిర్ణయించారు.

కేవలం 12 కేజీలు మాత్రమే ఈ స్పెషల్ స్వీట్ ను సిద్దం చేయగా.. సోమవారం రాత్రికి ఏడు కేజీలు అమ్మేశారు. మిగిలిన ఐదు కేజీలు అమ్ముడుబోతాయని భావిస్తున్నారు. బంగారు పూతతో ఉన్న మిఠాయికావటంతో దీనికి ఇంత భారీగా రేటును ఫిక్సు చేయాల్సి వచ్చినట్లు చెబుతున్నారు. బంగారం మీద మోజు ఉన్న బడాబాబులు దీన్ని కొనాలన్న ఆసక్తిని చూపిస్తున్నా.. దాని ధరను చూసి మాత్రం వారు సైతం వెనక్కి తగ్గుతున్నట్లు చెబుతున్నారు. ఏమైనా ఈ బంగారు మిఠాయి మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. బంగారం స్వీట్ కు ఆ మాత్రం ధర ఉండకపోతే ఏం బాగుంటుంది చెప్పండి?




Tags:    

Similar News