మోడీ క‌న్నీటి వెనుక `తంత్రం`.. డిఫెన్స్‌లో కాంగ్రెస్

Update: 2021-02-10 16:30 GMT
రాష్ట్ర రాజ‌కీయాల‌కు , కేంద్రంలోని పెద్ద‌లుచేసే రాజ‌కీయాల‌కు చాలా భిన్న‌మైన తేడా క‌నిపిస్తుంద‌ని అంటారు. ఏదీ ఊరికేనే చేసే అల‌వాటు.. కేంద్రంలోని పెద్ద‌ల‌కు ఎప్పుడూ ఉండ‌దు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న న‌రేంద్ర మోడీ స‌ర్కారు కూడా .. ఏదీ ఊరికేనే చేయ‌దు. ఎంతో లోతుగా.. ఎంతో ఆలోచ‌న‌తో.. త‌మ‌కు ఎంత మేర‌కు ల‌బ్ధి చేకూరుతుందో చూసుకుని అడుగులు వేయ‌డం తెలిసిందే. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వ‌స్తోందంటే.. తాజాగా పార్ల‌మెంటులో(రాజ్య‌స‌భ‌) ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంత‌టి వాడు.. క‌న్నీరు పెట్టుకున్నారు. దీంతో ఒక్క‌సారిగా అంద‌రి చూపూ.. మోడీ వైపు.. అదేస‌మ‌యంలో కాంగ్రెస్ వైపు కూడా ప‌డింది!

మోడీ క‌న్నీరు ఎందుకు పెట్టుకున్నారు..? అంటే.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, జ‌మ్ము, క‌శ్మీర్ మాజీ సీఎం.. గులాంన‌బీ ఆజాద్ కు పెద్ద‌ల స‌భ వీడ్కోలు ప‌లుకుతున్న సంద‌ర్భ‌మే. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఒక్క‌సారిగా క‌న్నీరు పెట్టుకున్నారు. ‘‘అధికారం, పదవులు వస్తాయి... పోతాయి. కానీ కొద్ది మందికి మాత్రమే వాటిని ఆకళింపు చేసుకుని ఎలా వ్యవహరించాలో తెలుసు. అలాంటి కొద్ది మందిలో ఆజాద్‌ ఒకరు. నేనూ, ఆజాద్‌ ఒకే సమయంలో ముఖ్యమంత్రులుగా పనిచేశాం. నేను గుజరాత్‌ సీఎం కాకమునుపే ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండేవారు. నాకు గుర్తు.. 2007లో కశ్మీర్లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రవాదుల దాడి జరిగినపుడు నాకు మొట్టమొదట ఫోన్‌చేసినది ఆజాదే. ఆ ఫోన్‌కాల్‌లో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు`` అంటూ.. ఆ పరిస్థితిని వివరిస్తూ ఏడుపు ఆపుకోలేకపోయా రు.

వాస్త‌వానికి గ‌త గుర్తు చేసుకోవ‌డం.. స‌హ‌జ‌మే! అయితే.. ప్ర‌ధాని వంటి.. ముఖ్యంగా అనేక ఆటుపోట్లు రుచి చూసిన‌.. ఆటు పోట్లు సృష్టించిన నాయ‌కుడిగా గుర్తింపు ఉన్న మోడీ వంటివారు క‌న్నీరు పెట్టుకోవ‌డం వెనుక `కార‌ణం` లేకుండా ఉంటుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌. ఇప్పుడు ప‌రిశీల‌కులు దానినే త‌ర‌చి చూస్తున్నారు. ఏటా అనేక మంది రాజ్య‌స‌భ‌కు వీడ్కోలు ప‌లుకుతారు. కానీ.. ఆజాద్ విష‌యంలోనే మోడీ ఇలా ఎందుకు చేశారు? అంటే.. కీల‌క‌మైన కార‌ణం స్ప‌ష్టంగా వెన‌కాల క‌నిపిస్తోంది. `క‌న్నీటి మాటున రాజ‌కీయ తంత్రం` ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఇదేదో ఉత్తిపుణ్యాన చెప్ప‌డం కాదు.. జ‌రిగిన‌.. జ‌ర‌గుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. `నిజం`.

కాంగ్రెస్ తో ఆజాద్‌ది సుదీర్ఘ ప్ర‌యాణం. అయితే.. ఇటీవ‌ల ఆయ‌న కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రె స్‌లో వంశ‌పారంప‌ర్య రాజ‌కీయాలు కొన‌సాగుతున్నందునే.. పార్టీ భ్ర‌ష్టుప‌డుతోంద‌ని తేల్చి చెప్పారు. పార్టీకి ఇప్పుడు.. స‌మూల మార్పులు మార్పులు కావాల్సిన త‌రుణం ఏర్ప‌డింద‌ని లేఖ రాశారు. దీంతో కాంగ్రెస్ ఆయ‌న‌పై ముభావంగా ఉంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ త‌ర‌ఫున మోడీ .. ఆయ‌న‌ను నెత్తిన పెట్టుకోవ‌డం.. అంటే.. కాంగ్రెస్ రేపు తృణీక‌రిస్తే.. బీజేపీద్వారాలు తెరిచే ఉంద‌నే సంకేతాలు పంపిన‌ట్ట‌యింది. అంటే..
మోడీ క‌న్నీటి వెనుక‌.. కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో ప‌డేసిన‌ట్ట‌యింది.

ఇప్పుడు ఆజాద్ రాసిన లేఖ ఘాటుగా ఉన్నా.. ఆయ‌న‌ను తిరిగి ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్య‌స‌భ‌కు పంపాలా? కాద‌నుకుంటే.. పార్టీకి ఇన్నేళ్లుగా ఆయ‌న సేవ‌ల‌ను కూడా కాద‌ని గెంటేసింద‌నే అప‌వాదు వేసేందుకు బీజేపీ ఎలానూ రెడీ అయిపోయింది. ఇలా ఆజాద్ విష‌యంలో కాంగ్రెస్‌ను డిఫెన్స్‌లో ప‌డేయ‌డ‌మే.. మోడీ క‌న్నీటి వెనుకున్న ప‌ర‌మార్థంగా జాతీయ మీడియా వెలువ‌రించిన సంచ‌ల‌న విశ్లేష‌ణ‌లు రాజ‌కీయాల్లో కాక‌రేపుతున్నాయి. ఇప్పుడు బంతి కాంగ్రెస్ కోర్టులో ప‌డింది.. కిం క‌ర్త‌వ్యం? మొత్తానికి మోడీ అండ్ బీజేపీ నేత‌లు కోరుకున్న‌ది ఇదే!! అందుకే క‌న్నీటి వెనుక‌.. తంత్రం.. చాలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.


Tags:    

Similar News