మన్ కీ బాత్ లో ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల ప్రాధాన్యం వర్ణించిన ప్రధాని

Update: 2020-08-30 09:50 GMT
ప్రధానమంత్రి మోదీ నెల నెలా  నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. తాజాగా అమల్లోకి వచ్చిన నూతన విద్యా విధానం ద్వారా పిల్లలకు   కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన  ఆంధ్రప్రదేశ్ గురించి పలు అంశాలను ప్రస్తావించారు. కరోనా  పరిస్థితుల కారణంగా విద్యార్థులు ఇంటిపట్టునే ఉండాల్సి వస్తోందని,  ఈ సమయంలో బొమ్మలను ఉపయోగించుకొని  పిల్లలు  సృజనాత్మకతను పెంచుకోవచ్చని ప్రధాని సూచించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నం జిల్లా ప్రఖ్యాత ఏటికొప్పాక బొమ్మల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఏటికొప్పాక కళాకారుడు సీవీ  రాజు గొప్పతనం గురించి వివరించారు. కృష్ణా జిల్లా కొండపల్లి బొమ్మల గురించి కూడా పలు అంశాలను ప్రస్తావించారు. లాక్ డౌన్ తో ఇళ్లలోనే ఉంటున్న విద్యార్థులు ఆన్లైన్ తరగతులతో పాటు బొమ్మల పట్ల కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారన్నారు. నూతన విద్యా విధానంలో బొమ్మల తయారీ,  వాటితో ఆడుకోవడం వంటి అంశాలకు  కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా బొమ్మల పరిశ్రమల ద్వారా 7 లక్షల కోట్ల రూపాయల మేర వ్యాపార కార్యకలాపాలు నడుస్తున్నాయని ప్రధాని తెలిపారు. కానీ మనదేశంలో  బొమ్మల తయారీ తక్కువగానే ఉందని చెప్పిన మోడీ.. బొమ్మల తయారీ పరిశ్రమల్లో స్టార్టప్ లను ప్రారంభించడానికి అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. బొమ్మల తయారీలో భారత్ ను ఒక హబ్ గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. మన దేశంలో కర్ణాటకలోని రామ్ నగర్ జిల్లా చెన్న పట్టణ, కృష్ణా జిల్లా కొండపల్లి, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని డుబ్రి, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో తయారవుతున్న బొమ్మలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్నట్లు మోదీ వివరించారు.
Tags:    

Similar News