ప్రియాంక గాంధీ నోట మంత్రాలు !

Update: 2022-03-03 03:39 GMT
మంత్రాలు అన్న‌వి జీవితాల‌ను ఎలా ప్ర‌భావితం చేస్తాయో..ఏపాటి ఉప‌శ‌మ‌నం ఇస్తాయో కానీ కొన్ని చోట్ల మంత్రాలు అన్న‌వి  జీవితాలను ఓ విధంగా ఉన్న‌తికి తీసుకుని వెళ్లాయి అన్న‌ది కొంద‌రి న‌మ్మ‌కం.ఇదే స‌మ‌యాన ఇత‌రుల అభివృద్ధికి ఏ విధంగా సహ‌క‌రిస్తాయి అన్న‌ది చెప్ప‌లేం కానీ ఈ సారి మాత్రం ఎన్నిక‌ల్లో మంత్రాల ప్ర‌భావం అటు కాంగ్రెస్ పైనా ఇటు బీజేపీ పైనా త‌ప్ప‌క ఉంటుంది.ఆ విధంగా రెండు పార్టీలూ మంత్ర ప‌ఠనం చేశాయి.

ఓట‌రు దేవుడు ఏ విధంగా క‌రుణిస్తాడో అన్న‌ది కొద్ది రోజులలో తేలిపోయినా,గ‌తం క‌న్నా భిన్నంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ త‌రహా రాజకీయాల‌ను పాటించాల‌ని  నిర్ణ‌యించుకుంది.అందుకే శ‌క్తిమంత్రం ప‌ఠిస్తోంది.యుక్తి సూత్రం మారుస్తోంది.ఇదీ ఉత్త‌ర‌ప్రదేశ్ లో ప్ర‌ధాన పార్టీల రాజ‌కీయ ముఖ చిత్రం.

హిందుత్వ రాజ‌కీయాల‌ను బీజేపీ మాత్ర‌మే చేయ‌గ‌ల‌దు అన్న‌మాట‌కు విరుద్ధంగా యూపీ ప‌రిణామాలు కొన్ని చోటుచేసుకుంటు న్నాయి.హిందువుల‌ను ఆకట్టుకోవ‌డంలో అగ్ర‌భాగాన బీజేపీ మాత్ర‌మే ఉండ‌గ‌ల‌దు అనేందుకు విరుద్ధంగా కాంగ్రెస్ వ‌ర్గాలు కూడా ఆ జాబితాలో చేరిపోయి,సంబంధిత ప‌రిణామాల‌ను మారుస్తున్నాయి.ఆ విధంగా ఈ సారి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఓటు బ్యాంకు రాజకీయాల‌లో కొంత‌లో కొంత త‌మ ప‌ద్ధతిని మార్చుకున్నాయి.

విశ్వాసాల‌ను గౌర‌వించ‌డం త‌ప్పేం కాకున్నా వాటిని త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా మార్చుకోవ‌డం లేదా మ‌లుచుకోవ‌డంలో ఇరు పార్టీలు పోటీ ప‌డుతూ,లేస్తూ ఉన్నాయి.ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఎన్న‌డూ లేని విధంగా పోయిన ప‌రువును నిలబెట్టుకునేందుకు హిందుత్వ జ‌పం ఒక‌టి బాగానే చేసింది.చేస్తోంది కూడా ! ఎందుకంటే ఇవాళ‌తో స‌హా మ‌రో విడ‌త ఎన్నిక‌లు యూపీలో మిగిలి ఉన్నాయి క‌నుక‌!ఇదే ద‌శ‌లో ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ హిందువుల ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు చాలా పాట్లే ప‌డ్డారు.

వాస్త‌వానికి ఇవ‌న్నీ బీజేపీకి అల‌వాటులో ఉన్న ప‌నులు. కానీ కాంగ్రెస్ కూడా బాబాలు,మ‌త పెద్ద‌ల చుట్టూ తిరుగుతూ,తిరుగుతూ కొత్త ప‌ద్ధ‌తుల‌ను ఒంటికి పూసుకుంది.ఆ ఒంటికి పూసుకున్న బూడిద కార‌ణంగా ఓట్లు వ‌స్తాయా అన్న‌దే పెద్ద సందేహం మ‌రియు సందిగ్ధం.

కొన్ని చోట్ల ప్రియాంక శ‌క్తి మంత్రాన్ని జ‌పించారు.కొన్ని చోట్ల గాయ‌త్రీ మంత్రాన్ని ప‌ఠించారు.కొన్ని చోట్ల ఆమె మ‌హా మృత్యుంజ‌య మంత్రాన్ని చ‌దివి వినిపించారు.మంత్రాల‌న్నీ శ‌క్తులను అందిస్తాయి అని,సానుకూల శ‌క్తుల కార‌ణంగా,దైవిక శ‌క్తుల కార‌ణంగా విజ‌యాలు సిద్ధిస్తాయి అని ప్రియాంక నమ్ముతున్నారు.

ఆ న‌మ్మ‌కంలో భాగంగానే ఆమె రాజకీయాలు న‌డుపుతున్నారు.ప్ర‌చార స‌భ‌లు నిర్వ‌హించారు కూడా! వాస్త‌వానికి వార‌ణాసి,కాశీ,అయోధ్య త‌దిత‌ర పుణ్య క్షేత్రాల‌తో అల‌రారే ఉత్త‌ర ప్ర‌దేశ్ లో హిందుత్వం అన్న‌ది ప్రబ‌లంగా వినిపించే ప‌దం.అక్క‌డ హిందూ మ‌తం మూలాలు, రాముడి పుట్టుక ఆన‌వాళ్లు ఇంకా ఎన్నో  చ‌రిత్ర సంబంధ ఆధారాలు ఉన్నాయ‌ని ఇప్ప‌టికే నిరూప‌ణ అయింది.

అయోధ్యను నమ్ముకునే చాలా కాలం బీజేపీ రాజకీయాలు చేసింది..చేస్తుంది కూడా..మ‌నుగ‌డ‌కు సంబంధించి ప్ర‌శ్న త‌లెత్తిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ బీజేపీ చేసిన ప‌ని ఇదే! ఇప్పుడీ సిద్ధాంతాన్ని ఇంకా చెప్పాలంటే ఏ మ‌నుగ‌డకూ నోచుకోని కాంగ్రెస్ నెత్తిన పెట్టుకోవ‌డం అన్న‌ది నిజంగానే వింత!ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ సెక్యుల‌ర్  అనే వ‌ర్డ్ చుట్టూ తిర‌గ‌డం అన్న‌ది ఈ ఒక్క ఎన్నిక‌ల్లో  చేయ‌లేదు.

ఇక‌పై కూడా హిందూ ప్ర‌భావిత ప్రాంతాల్లో ఏమయినా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఇలాంటి ప‌నులే చేయాల‌ని చేస్తార‌ని కూడా ప్రియాంక‌ను చూస్తే స్థిర అభిప్రాయం క‌లుగుతుంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.
Tags:    

Similar News