అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే దానికి చాలా లెక్క ఉంది

Update: 2016-02-18 17:30 GMT
ఈ మధ్యన ఢిల్లీ పర్యటన వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారీ వినతుల లిస్ట్ ఇచ్చారు. వినతుల్లో ప్రధానమైన ఒకటి.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో నియోజకవర్గాల సీట్ల సంఖ్యను పెంచాలనడం. అనంతరం తన ఖమ్మం జిల్లాలో జరిపిన రెండు రోజుల పర్యటనలోనూ అసెంబ్లీ స్థానాల పెంపును ప్రస్తావించిన కేసీఆర్.. అసెంబ్లీలో సీట్ల సంఖ్యను పెరిగిన తర్వాతే.. ఖమ్మం జిల్లాను రెండుగా చేస్తానని ప్రకటించటం తెలిసిందే. తెలంగాణలోని 119 స్థానాల నుంచి 153కు.. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల నుంచి 225కు పెంచేలా ఏపీ విభజన చట్టంలో మార్పులు చేస్తామని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల లోపే అసెంబ్లీ స్థానాల్ని పెంచుతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినంత సులువుగా అయిపోదని.. దానికి పెద్ద లెక్కే ఉందంటున్నారు. పైగా ఇప్పటికిప్పుడు పూర్తి కావటం సాధ్యమయ్యే వ్యవహారం కాదని తేల్చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ప్రక్రియ చూస్తే..  తొలుత రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందాలి. వీటిని కేంద్ర హోం శాఖ.. న్యాయశాఖ పరిశీలించాల్సి ఉంటుంది. అనంతరం దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఆ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిన పక్షంలో.. ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ కు న్యాయశాఖ నోట్ పంపాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదం పొంది.. చట్టసవరణ బిల్లుగా పార్లమెంటు ముందుకు వస్తుంది. అలా వచ్చిన బిల్లును భవిష్యత్తులో కోర్టుల్లో ఎవరూ ప్రశ్నించే వీలు లేని విధంగా రూపొందించాల్సి ఉంటుంది. అలా చేశాక బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారుతుంది. అప్పుడు మాత్రమే ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచే వీలుందని చెబుతున్నారు.

ఇదంతా జరగాలంటే కనీసం.. మూడేళ్ల సమయం పట్టే వీలుంది. అంటే.. 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు అధికారిక ప్రక్రియకే సరిపోతుంది. ఒకవేళ కేంద్రం కాని ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంటే మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచుకునే వీలుంది. కాకుంటే.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కీలకమైన ఈ వ్యవహారాన్ని భుజానికి ఎత్తుకొని చేసే వాళ్లు ఎవరన్నది ఒక ప్రశ్న. అయితే.. ఒక తెలుగువాడిగా తాను ఈ పనిని పూర్తి చేస్తానని కేంద్రమంత్రి వెంకయ్య పేర్కొనటం గమనార్హం. మరి.. వెంకయ్య ఎంతవరకు తన మాటను నిలబెట్టుకుంటారో చూడాలి.
Tags:    

Similar News