ఫ్యూచర్; గంట ఫ్లైట్ జర్నీ రూ.2500?

Update: 2016-05-04 06:40 GMT
విమాన ప్రయాణం అందరికి చేరువయ్యేలా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో విమాన కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం.. భారీగా టిక్కెట్టు ధరలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వైఖరికి చెక్ చెప్పేందుకు పౌర విమానయాన శాఖ తాజాగా ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది.  ఈ ప్రతిపాదన కానీ ఆమోదం పొంది అమల్లోకి వస్తే.. విమాన ప్రయాణం కారుచౌక కానుంది.

పౌర విమానయాన శాఖ చేస్తున్న తాజా ప్రతిపాదన ప్రకారం.. గంట ప్రయాణానికి విమాన టిక్కెట్టు ధర రూ.2500 ఉండాలని భావిస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదన దేశీయ విమానయానానికి సంబంధించి మాత్రమే.  ప్రకృతి విపత్తులు.. ప్రత్యేక సందర్భాల్లో అదునుచూసుకొని ఫ్లైట్ టిక్కెట్లను విమాన కంపెనీలు ఇష్టారాజ్యంగా టిక్కెట్ల ధరను పెంచేస్తూ నిర్ణయం తీసుకోవటంపై పార్లమెంటులో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్స్ కంపెనీల అడ్డగోలు తీరుకు చెక్ పెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. దేశీయంగా విమాన ప్రయాణానికి వసూలు చేసే ఛార్జిని రూ.2500కు పరిమితం చేయాలన్న ప్రతిపాదనను సిద్ధం చేసినట్లుగా చెప్పారు. మంత్రి చెప్పినట్లుగా విమాన ఛార్జీలు కానీ ఆ స్థాయికి తగ్గితే.. విమాన ప్రయాణ రద్దీ పెరగటం ఖాయం. చూస్తుంటే.. విమాన ప్రయాణం రానున్నరోజుల్లో కారుచౌక కానుందన్నమాట.
Tags:    

Similar News