పనామా కంటే ముందు పబ్లిక్ అకౌంట్సు కమిటీ చెప్పింది.

Update: 2016-04-09 08:21 GMT
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పనామా పత్రాల తాకిడి ఆంధ్రప్రదేశ్‌ లోనూ అలజడి రేపిన సంగతి తెలిసిందే. పలువురు తెలుగు వ్యాపారవేత్తల పేర్లు పనామా పత్రాల్లో చోటు చేసుకున్నాయి. వారిలో కొందరు ఎవరికీ తెలియనివారైనప్పటికీ దుబాయి కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ప్ర్రముఖ భారత పారిశ్రామికవేత్త మధు కోనేరు పేరు అందులో ఉండడం సంచలనంగా మారింది. ఆయన అవినీతికి సంబంధించి మరిన్ని ఆధారాలను పనామా పత్రాలు బయటపెట్టాయి. పనామా న్యాయ సంస్థకు అనుంబంధ సంస్థ అయిన మోసాక్‌ ఫెన్సెకా(ఎమ్‌ ఎఫ్‌) సహాయంతో విదేశాల్లో 12 కంపెనీల ఏర్పాటుకు రిజిస్టర్  చేసినట్లు బయటపడింది. పరిశ్రమలకు ఖనిజాల్ని సమకూర్చే వ్యాపారం చేస్తున్న మధు - ఆయన తండ్రి కోనేరు రాజేంద్ర ప్రసాద్‌ లపై రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో గతంలో ఛార్జిషీట్‌ నమోదైంది. ఈ వ్యవహారం నుంచి వారిని చాకచక్యంగా తప్పించడంలో ఎమ్‌ ఎఫ్‌ ప్రధాన పాత్ర పోషించిందట.

ఎమ్మార్ కుంభకోణం కేసులోనూ మధు నిందితుడు. అందులోంచి ఆయన బెయిలుపై బయటకొచ్చారు. ఈ కేసుల్లోనూ ఆయన ఎంఎఫ్ సహాయాన్ని తీసుకున్నారట. లగ్జరీ భవంతులను విక్రయించిన సొమ్మును దుబాయికి పంపించి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఆరోపణలున్నాయి. పనామాపత్రాలు ఏం బయటపెట్టాయన్నది పక్కనపెడితే... పనామా పత్రాల్లో ఇవన్నీ వెలుగు చూడడానికి ముందే కోనేరు మధు తండ్రి  కోనేరు ప్రసాద్ కు చెందిన ట్రైమెక్స్ సంస్థ అక్రమాలను నిగ్గు తేల్చడమే కాకుండా ఆ సంస్థ అనుమతిలేని ఖనిజాలను విదేశాల్లో విక్రయిస్తూ పెద్దమొత్తంలో డబ్బు సంపాదించి విదేశాల్లోనే నిల్వ చేస్తోందని ఏపీ శాసన సభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గుర్తించడం విశేషం. పనామా పత్రాల్లోనూ ట్రైమెక్స్ ప్రస్తావన ఉంది. అయితే... పనామా కంటే ముందే మన పబ్లిక్ అకౌంట్సు కమిటీ ఈ సంగతి బయటపెట్టింది.

శ్రీకాకుళం జిల్లాలో ట్రైమెక్స్ పేరిట కోనేరు ప్రసాద్ కు భారీ పరిశ్రమ ఉంది. సముద్రపు ఇసుక నుంచి మినరల్స్ తీసే పరిశ్రమ ఇది. ఇల్మనైట్ - గార్నెట్ - జిర్కాన్ - రుటైల్ - సిల్మనైట్ ఖనిజాల వెలికితీతకే వారికి అనుమతి ఉంది. కానీ.... వాటితో పాటు మోనోజైట్ అనే ఖనిజాన్ని కూడా వెలికి తీసి వీటితో కలిపి రహస్యంగా విదేశాలకు తరలించి అక్కడ విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనుమానించింది. స్థానికంగా అనుమతుల్లేకుండా అటవీ భూముల్లో తవ్వడం, నిబంధనల ఉల్లంఘనలు వంటివన్నీ గుర్తించి తాజాగా ట్రైమెక్స్ తవ్వకాలను నిలిపివేయించారు కూడా. అయితే... ప్రజా పద్దుల కమిటీ అనుమానించినట్లుగా విదేశాల్లో ఈ విలువైన ఖనిజ విక్రయం అన్నది నల్లధనం, అక్రమంగా తరలింపు వంటి అంశాలకు సంబంధించిందే. పనామా పత్రాల్లోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది.  ట్రైమెక్సు పేరులో మార్పులు చేయడం వంటి అంశాలను కూడా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనుమానించింది. దీంతో పనామా కంటే ముందే మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ట్రైమెక్సు అక్రమాలను గుర్తించినట్లయింది.
Tags:    

Similar News