ప్రి పోల్ సర్వే.. ఆ పార్టీకి షాక్ తప్పదా?

Update: 2020-10-29 16:31 GMT
తెలంగాణాలో జరుగుతున్న దుబ్బాక బై ఎలక్షన్లలో అధికార టీఆర్ఎస్ కు షాక్ తప్పదా ?  గెలుపుకోసం తీవ్రంగా కష్టపడుతున్న బీజేపీ బాగా హీట్ పెంచేస్తోందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి.  పోలింగ్  తేదీ దగ్గర పడుతున్న కొద్దీ గెలుపు విషయంలో టీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతున్నట్లే కనబడుతోంది. అందుకనే టీఆర్ఎస్ గెలుపుపై జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే 2018లో జరిగిన ఎన్నికల్లో దుబ్బాక నుండి సోలిపేట రామలింగారెడ్డి సుమారు 62 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. సోలిపేట హ్యాట్రిక్ సాధించిన కొద్దిమంది టీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన కరోనా వైరస్ కారణంగా హఠాత్తుగా చనిపోయారు. దాంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. టీఆర్ఎస్ నుండి సోలిపేట భార్యనే కేసీయార్ రంగంలోకి దింపారు. అధికారంలో ఉండటం+సానుభూతి ఓట్లు పడిత కనీసం లక్ష ఓట్ల మెజారిటితో తమ అభ్యర్ధి గెలుస్తుదని కేసీయార మొదట్లో అంచనాలు వేశారు.

నిజంగా కూడా పోల్ మేనేజ్ మెంట్లో టీఆర్ఎస్ దిట్ట. అదే సందర్భంలో అధికారంలో ఉండటం, పార్టీలో కీలక నేత, మంత్రి హరీష్ రావుకు గెలుపు బాధ్యతలను అప్పగించటంతో తమకు తిరుగేలేదని అనుకున్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ పరిస్ధితిలో మార్పులు కనబడ్డాయి. ఎలాగంటే బీజేపీ తరపున సీనియర్ నేత, లాయర్ రఘునందనరావు పోటీలోకి దిగారు. ఈయన వరుసగా మూడోసారి పోటి చేస్తున్నారు. మొదటి రెండుసార్లు  ఓడిపోయి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఒకవైపు సోలిపేట సానుభూతి, మరోవైపు రఘునందనరావు వరుస ఓటముల సానుభూతితో ఎన్నికల ప్రచారం బాగా ఊపందుకుంది.  కాంగ్రెస్ అభ్యర్ధిగా దివంగత నేత చెరకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాసులరెడ్డి కూడా పోటీలో ఉన్నారు. అయితే పోటీ ప్రధానంగా టీఆర్ఎస్-కమలం మధ్యే ఉంటుందని అర్ధమవుతోంది. ఇటువంటి సమయంలోనే కారుపార్టీలో గెలుపుపై ఏమన్నా అనుమానాలు మొదలయ్యాయా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే బీజేపీ అభ్యర్ధి ప్రచారాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అలాగే బీజేపీ అభ్యర్ధి మామ ఇంట్లో  డబ్బలు దొరికాయనే వివాదంతో టీఆర్ఎస్ నేతలపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.

బీజేపీ అభ్యర్ధి మామ ఇంట్లో టీఆర్ఎస్ నేతలే డబ్బులు పెట్టి పోలీసులను పంపారనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో అసలు పోలీసులతోనే  టీఆర్ఎస్ నేతలు డబ్బులు ఇంట్లో పెట్టించారనే ఆరోపణలు మరోవైపు పెరిగిపోతున్నాయి. ఈ గోల ఇలాగుండగానే  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా డబ్బుల గొడవలో జోక్యం చేసుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఎన్నికల ప్రచారంలో ఉన్న కిషన్ రెడ్డికి డబ్బుల గోల విషయం తెలియగానే వెంటనే నేతలను వెంటపెట్టుకుని  వచ్చేయటంతో పోలీసులకు ఏమి చేయాలో అర్ధంకాలేదు.

ఇటువంటి అనేక సంఘటనలను చూసిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్ధి గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తమ గెలుపుపై టీఆర్ఎస్ లో నిజంగానే అంత ధీమా ఉంటే ఇంత గోల చేయాల్సిన అవసరం ఏముంటుందని కమలం నేతలు అడుతున్న ప్రశ్నలకు అధి కారపార్టీ నుండి సమాధానం లేదు.  ఇటువంటి అనేక ఘటనల తర్వాత ‘పబ్లిక్ పల్స్ సర్వే’ సంస్థతో  తుపాకి.కామ్ మాట్లాడినదాన్ని బట్టి టీఆర్ఎస్ అభ్యర్థితో పోలిస్తే 1-2 శాతం మొగ్గు రఘునందనరావు వైపు ఉన్నట్లు అర్ధమవుతోంది.

హరీష్ రావు పదే పదే బీజేపీ అభ్యర్ధిని టార్గెట్ చేసుకోవటం కూడా అధికార పార్టీలో పెరిగిపోతున్న టెన్షన్‌కు సంకేతంగా చెప్పుకోవాలి. సాధారణంగా సర్వేల్లో వచ్చిన ఫలితాలు 2-3 శాతం అటు ఇటు అయ్యే అవకాశాలూ లేకపోలేదు. కాబట్టి ఏమైనా జరగొచ్చు. కానీ పోల్ మేనేజ్మెంట్ గనుక జాగ్రత్తగా చేసుకుంటే బీజేపీ అభ్యర్ధికి గెలుపు అవకాశాలను కొట్టిపారేయలేమని ‘పబ్లిక్ పల్స్ సర్వే’ సీఈవో శ్రీనివాస్ అంటున్నారు. పోలింగ్ తర్వాత మరోసారి సర్వే చేస్తే ఫలితంపై స్పష్టత రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Tags:    

Similar News