బాబు నిర్ణయాన్ని ఏకిపడేసిన పాండిచ్చేరి మంత్రి

Update: 2017-12-27 17:10 GMT
కాపుల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు పెట్టిన లొసుగుల తీర్మానాన్ని రాష్ర్టంలోని వారే కాదు - ఇతర రాష్ర్టాలకు చెందినవారు కూడా తప్పుపడుతున్నారు. తాజాగా పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు కూడా చంద్రబాబు నిర్ణయంలోని లోపాలేంటో చెప్పారు. అసలు బీసీ కమిషన్ తన నివేదిక ఇవ్వకుండా చంద్రబాబు తీర్మానం ఎలా చేస్తారని.. అది సరికాదని - రిజర్వేషన్ల సాధనకు అది సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.    
    
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కమీషన్ రిపోర్టు రాకుండానే అసెంబ్లీలో 5శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ తీర్మానం చేశారని.. ఇలా చేయడం సరైందికాదని మల్లాడి కృష్ణారావు అన్నారు. కాపులను బీసీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ ముక్కామల నుండి అంబాజీపేట వరకూ బీసీ సంఘాలు ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ… కాపులను బీసీల్లో చేర్చడంపై బీసీ మంత్రులు - ఎమ్మెల్యేలు స్పందించాలన్నారు. దీనిపై బీసీ ప్రజాప్రతినిధులు స్పందించాలన్నారు.
    
కాగా 50 శాతానికి మించి రిజర్వేషన్లు సాధ్యం కాదని.. అలాంటి హామీలు ఇస్తే అది మోసం చేయడమేనని ప్రధాని మోదీ కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో చంద్రబాబుది ఉత్తుత్తి తీర్మానమని కాపు సామాజికవర్గ నేతలు కూడా అంటున్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేయకుండా ఇలాంటి లొసుగుల తీర్మానాలతో మభ్యపెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇతర రాష్ర్టాల నేతలు కూడా చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు మాత్రం తాను కాపులకు ఏదో న్యాయం చేసినట్లుగా ప్రతి సమావేశంలోనూ ప్రచారం చేసుకుంటున్నారు


Tags:    

Similar News