పంజాగుట్ట పోలీస్ స్టేషన్.. దేశంలోనే నం.2

Update: 2018-01-08 07:29 GMT
హైదరాబాద్ నడిబొడ్డున ఉండే పంజాగుట్టకు వచ్చిన వాళ్లందరికి అక్కడి పోలీస్ స్టేషన్ తారసపడకుండా పోదు. సెంట్రల్ మాల్ ఎదురుగానే ఉండే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ బాగా ఫేమస్. ఇప్పుడు దీని పాపులారిటీ మరింత పెంచే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. దేశంలోని అత్యుత్తమ పోలీస్ స్టేషన్ లలో పంజాగుట్టది రెండో స్థానంలో నిలవడం విశేషం. హోం మంత్రిత్వ శాఖ.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉమ్మడిగా నిర్వహించిన సర్వేలో భాగంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు ఈ ర్యాంకు రావడం విశేషం. పోలీసింగ్.. కేసుల పరిష్కారం.. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం.. లాంటి అంశాల ఆధారంగా దేశంలో టాప్-10 పోలీస్ స్టేషన్ల జాబితాను ప్రకటించారు.

తమిళనాడులోని కోయంబత్తూరు నగరంలో ఆర్ ఎస్ పురం పోలీస్ స్టేషన్ ఈ జాబితాలో అగ్రస్థానం సాధించగా.. రెండో స్థానం పంజాగుట్ట స్టేషన్ కు దక్కింది. ఇటీవలే ముగిసిన ఆల్ ఇండియా కాన్ఫెరెన్స్ ఆఫ్ డైరెక్టర్ జనరల్స్/ఇన్ స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మీట్లో భాగంగా ఈ పది పోలీస్ స్టేషన్లకు బహుమతులు అందజేశారు. హైదరాబాద్ పోలీస్ శాఖ తమ వెబ్ సైట్లో.. సోషల్ మీడియా పేజీల్లో ఈ విషయాన్ని ఘనంగా ప్రకటించుకుని ట్రోఫీ ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ విషయమై కొందరు అభినందనలు తెలియజేస్తే.. ఐతే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో అపరిష్కృతంగా ఉన్న తమ కేసుల గురించి ప్రస్తావిస్తూ దానికెలా అవార్డిచ్చారంటూ ఇంకొందరు ప్రశ్నలు సంధిస్తుండటం విశేషం.


Tags:    

Similar News