ఆశీర్వాదమా... రాజకీయ ఆహ్వానమా?

Update: 2017-05-23 07:50 GMT
   
తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసిన బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య, బీజేపీ నేత పురందేశ్వరిల భేటీ వెనుక ఉద్దేశాలు అందరికీ అర్థమవుతున్నా కృష్ణయ్య మాత్రం దానికి కొత్త భాష్యం చెప్తున్నారు. తమ సమావేశం వెనుక రాజకీయ కారణాలేవీ లేవంటున్నారు. అయితే... రాజకీయ భేటీల్లో కారణాలు పైకొకటి కనిపించినా లోపల వేరే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు.
    
బీజేపీ నాయకురాలు పురంధేశ్వరితో భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని టీటీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. తన కుమారుడి వివాహానికి ఆమె హాజరుకాలేక పోయారని... అందుకే, నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు ఆమె తమ ఇంటికి వచ్చారని చెప్పారు. అంతే తప్ప తననేమీ  బీజేపీలోకి ఆహ్వానించేందుకు రాలేదని ఆయన అంటున్నారు.
    
ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. ఉపాధ్యాయుల ఉద్యోగాలను భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని... డీఎస్సీని కూడా ప్రకటించకుండా మోసం చేస్తోందని విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని... లేకపోతే జూన్ రెండవ వారం నుంచి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు.   
    
అయితే... టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆర్నెళ్లకే ఆ పార్టీకి దూరమైపోయారు. టెక్నికల్ గా అందులోనే ఉన్నా పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంటున్నారు. అంతేకాదు... గతంలో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకంగా గళమెత్తారు కూడా. మరోవైపు ఆయన పాలక టీఆరెస్ పైనా నిత్యం విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బలమైన బీసీ వర్గం మద్దతు ఉన్న ఆయన ఏ పార్టీ అండా లేకుండా రానున్న ఎన్నికలకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఏదో ఒక పార్టీలో ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అది బీజేపీ తప్ప ఇంకేమీ కాదన్నది విశ్లేషకుల మాట. సో... కొన్నాళ్లు ఆగితే క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు.


Tags:    

Similar News