ఓడినా.. ఆయ‌న‌కే సీఎం ప‌ద‌వి?

Update: 2022-03-22 02:30 GMT
ఇటీవ‌ల ఉత్త‌రాఖండ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడ‌నా బీజేపీ నేత పుష్క‌ర్‌సింగ్ ధామి మ‌రోసారి సీఎం కాబోతున్నారా? పార్టీ అధిష్ఠానం ఆయ‌న వైపే మొగ్గుచూపుతందా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, గోవా, మ‌ణిపూర్‌లో బీజేపీ గెలిచి అధికారాన్ని నిల‌బెట్టుకుంది. ఈ నేప‌థ్యంలో ఒక్కో రాష్ట్రానికి వ‌రుస‌గా ముఖ్య‌మంత్రుల‌ను బీజేపీ అధిష్ఠానం ఖ‌రారు చేస్తూ వ‌స్తోంది. యూపీకి మ‌ళ్లీ యోగినే సీఎంగా బాధ్య‌త‌లు తీసుకోబోతున్నారు. ఇక మ‌ణిపూర్‌కు వ‌రుస‌గా రెండో సారి ఎన్‌.బిరేన్ సింగ్ సీఎం కాబోతున్నారు. ఇక మిగిలింది గోవా, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాలే. వీటిల్లోనూ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రులు పుష్క‌ర్ సింగ్‌, ప్ర‌మోద్ సావంత్‌లే రేసులో ముందంజ‌లో ఉన్నార‌ని స‌మాచారం.

ఉత్త‌రాఖండ్ సీఎం పీఠంపై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌కు తెర‌దించేందుకు బీజేపీ హైక‌మాండ్ సిద్ధ‌మైంది. కొన్ని రోజులుగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు ముగింపు ప‌ల‌క‌నుంది. మ‌రోసారి పుష్క‌ర్‌సింగ్ ధామీకే సీఎం ప‌ద‌వి క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలున్నాయి. కొత్త‌గా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు సోమ‌వారం డెహ్రాడూన్‌లో స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశంలోనే త‌మ ముఖ్య‌మంత్రిని ఎన్నుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 70 స్థానాలున్న ఉత్త‌రాఖండ్ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో 47 సీట్లు సాధించిన బీజేపీ వ‌రుస‌గా రెండో సారి అధికారం ద‌క్కించుకుని చ‌రిత్ర సృష్టించింది.

ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం ద‌క్కిన‌ప్ప‌టికీ సీఎంగా ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే విష‌యంపై అధిష్ఠానం ఇన్ని రోజులు ఆలోచించింది. ముఖ్య‌మంత్రిగా ఉన్న పుష్క‌ర్ సింగ్ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ప‌గ్గాలెవ‌రికి అప్పగించాల‌నే విష‌యంపై గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఓడిన‌ప్ప‌టికీ పుష్క‌ర్‌కే బాధ్య‌త‌లు క‌ట్ట‌బెట్టాల‌ని కొంత‌మంది ఎమ్మెల్యేలు భావిస్తుంటే.. మ‌రికొంద‌రేమో మార్పు కొరుకుంటున్నార‌నే వార్త‌లు వ‌చ్చాయి. కొంత‌మంది సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌తో పాటు రాజ్య‌స‌భ స‌భ్యుడు అనిల్ బ‌లూనీ, కేంద్ర మాజీ మంత్రి, ఉత్త‌రాఖండ్ మాజీ సీఎం ర‌మేశ్ పోఖ్రియాల్‌, కేంద్ర మంత్రి అజ‌య్ భ‌ట్ పేర్లు వినిపించాయి. చివ‌ర‌కు అధిష్ఠానం మాత్రం పుష్క‌ర్‌సింగ్ వైపే మొగ్గు చూపుతున్న‌ట్లు టాక్‌.
Tags:    

Similar News