విదేశాల్లో పుతిన్‌ విసర్జితాలను స్వదేశానికి తెచ్చి.. ఏమిటో?

Update: 2022-06-15 04:30 GMT
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంటే ప్రపంచానికి కొత్తగా చెప్పేదేమీ లేదు. నాలుగైదు నెలల కిందట అయితే ఆయనంటే ఎవరో తెలియని వారు ఉండేవారేమో కానీ, ఇప్పుడు కాదు. ఉక్రెయిన్ పై దండయాత్ర ద్వారా అంతగా పాపులర్ అయ్యారు. 20 ఏళ్లుగా రష్యాను గుప్పిట పట్టి ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్న పుతిన్ అంటే.. పశ్చిమ దేశాలకు మంట. ఆయన నిరంకుశుడని తీవ్రంగా మండిపడుతుంటాయి. అయితే, ఆయుధపరంగా, ఆర్థికంగా సమఉజ్జీ అయినందున అమెరికా, గ్యాస్, ఇంధనం సరఫరా కారణంగా యూరప్ దేశాలు పుతిన్ ను ఏమీ చేయలేని పరిస్థితి. అంతేగాక.. పుతిన్ కు కోపమొస్తే మొత్తం యూరప్ కే ముప్పు. అందుకే స్వీడన్, ఫిన్లాండ్ వంటి దేశాలు రష్యా అంటే హడలెత్తిపోతాయి. ఉక్రెయిన్ మీద పుతిన్ కన్నెర్రతో స్వీడన్, ఫిన్లాండ్ అత్యవసరంగా నాటో కూటమిలో చేరిక ప్రయత్నాలను మొదలుపెట్టాయి. 2014లో పుతిన్.. ఉక్రెయిన్ కు చెందిన క్రిమియాను అడ్డంగా ఆక్రమించేశారు. కానీ, ఈ ఎనిమిదేళ్లలో ఏ దేశమూ ఆయనను ఏమీ చేయలేకపోయింది.

అనారోగ్యం వదంతులు పుతిన్ కు తీవ్ర స్థాయి అనారోగ్యం అని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి.  క్యాన్సర్‌ అని, పార్కిన్సన్‌ అని.. విక్టరీ డే (మే 8) వేడుకల్లో పుతిన్ కుంటుతూ కనిపించారని.. సాధారణ వాతావరణంలోనూ చలికోటు వేసుకున్నారని అనేక వదంతులు వ్యాపించాయి. ఇవన్నీ పశ్చిమ దేశాల ప్రచారమే కానీ.. కచ్చితంగా రష్యా నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు కావు. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ చాలా గోప్యంగా ఉంచుతుంది. తాజాగా పుతిన్ విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన మల మూత్రాలను సేకరించి, మాస్కోకు తీసుకెళ్లి పడవేస్తారనే అత్యంత ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు.. ఇందుకోసం స్పెషల్ గా ఓ అంగరక్షకుడు ఉంటారనే ఓ నివేదిక పేర్కొంటోంది.

ముప్పుందనే.. ముందుజాగ్రత్త ఓ ఫిడేల్ క్యాస్ట్రో.. ఓ సద్దాం హుస్సేన్.. ఓ కల్నల్ గడాఫీ.. ఓ హ్యూగో చావెజ్.. ఒకరేమిటి.. అమెరికా లేదా పాశ్చాత్య దేశాలు హత్యా ప్రయత్నాలు చేసిన దేశాల అధ్యక్షులు ఎందరో? అందుకే అమెరికాతో శత్రుత్వం ఉన్న దేశాధినేతలు తమ భద్రత, ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. తమకు సంబంధించిన విషయాల్లో ఏమాత్రం అవకాశం చిక్కకుండా చూసుకుంటారు. పుతిన్.. విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన మల మూత్రాలను సేకరించి స్వదేశానికి తీసుకెళతారనే తాజా వార్త కూడా ఇలాంటి రక్షణ చర్యల్లో భాగమే.  పుతిన్‌ ఆరోగ్య రహస్యాలు విదేశీ గూఢచారులకు చిక్కకుండా ఉండేందుకే ఈ పని చేస్తారని తేలింది. రష్యా కార్యకలాపాలపై సుదీర్ఘ కాలం వార్తలు సేకరించిన పరిశోధనాత్మక జర్నలిస్టులు దీనిని వెలుగులోకి తెచ్చారు.

రష్యాపై రెండు పుస్తకాలు రాసిన రెజిస్‌ జింటేతో పాటు 13ఏళ్లపాటు రష్యా వార్తలను రాసిన మిఖైల్‌ రూబిన్‌ రాసిన తాజా వ్యాసం ఫ్రెంచ్‌ న్యూస్‌ మ్యాగజైన్‌ 'ప్యారిస్‌ మ్యాచ్‌'లో ప్రచురితమైంది. పుతిన్‌ విదేశాల్లో పర్యటించినప్పుడు ఆయన రక్షణను ఫెడరల్‌ ప్రొటెక్షన్‌ సర్వీస్‌ నిర్వహిస్తుంది. ఇతర ప్రభుత్వ అధికారుల సంరక్షణనూ ఈ ఎఫ్‌పీఎస్‌ చూసుకుంటుంది.పుతిన్‌ మల విసర్జనకు వెళ్లిన ప్రతిసారి ఓ ఎఫ్‌ఎస్‌ఓ ఏజెంట్‌ (ఫెడరల్‌ గార్డ్‌ సర్వీస్‌) వాటిని సేకరించి ఓ ప్రత్యేకమైన ప్యాకెట్‌లో భద్రపరుస్తారు.

అనంతరం వాటిని ఓ సూట్‌కేసులో ఉంచి రష్యాకు తీసుకెళ్తారు. 2019 మే నెలలో ఫ్రాన్స్‌ పర్యటన, 2019 అక్టోబర్‌లో సౌదీ అరేబియాలో పర్యటించిన సందర్భాల్లో పుతిన్‌ విసర్జనాలను సేకరించినట్లు సమాచారం. 2019లో ఫ్రాన్స్‌లో పర్యటన సమయంలో పుతిన్‌ బాత్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఆయన వెంట ఆరుగురు బాడీగార్డులు తోడుగా ఉన్నారు. అందులో ఒక వ్యక్తి చిన్న సూట్‌కేసును తీసుకొని బాత్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చినట్లు ఉన్న ఓ వీడియోను ఒక జర్నలిస్టు సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.
 
డీఎన్‌ఏ చోరీ భయమే కారణం..కీలక నేతల మలమూత్రాలతో వారి ఆరోగ్య రహస్యాలపై గూఢచర్యానికి పాల్పడే ప్రయత్నాలు ఎంతో కాలంగా సాగుతున్నాయనే వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పుతిన్‌ మలమూత్రాలను సేకరించే అంశం ఎప్పటినుంచో కొనసాగుతోంది. గతంలో వియన్నా పర్యటన సందర్భంగా ఇలాంటి ఘటనే జరిగింది. చైనా నేత మావో జెడాంగ్ తో పాటు ఇతర ఉన్నతాధికారుల గురించి తెలుసుకునేందుకు వారి మలాన్ని విశ్లేషించి సోవియట్‌ యూనియన్‌ అధినేత జోసెఫ్‌ స్టాలిన్‌ గూఢచర్యానికి ప్రయత్నించినట్లు 2016లో బయటపడింది.   కోల్డ్‌వార్‌ సమయంలో తూర్పు జర్మనీలో సోవియట్‌ బలగాలు ఉపయోగించిన టాయిలెట్‌ పేపర్లను బ్రిటిష్‌ నిఘా సంస్థలు జల్లెడ పట్టాయనే వాదన ఉంది. ఈ విషయాన్ని వెల్లడించిన బ్రిటిష్‌ సైనిక నిపుణులు టోని గెరాగ్టీ.. అందుకే సోవియట్‌ సైన్యానికి టాయిలెట్‌ పేపర్లను ఇవ్వరని పేర్కొన్నాడు.

గూఢచర్యానికి సంబంధించి మలమూత్ర విసర్జన, డీఎన్‌ఏ వంటి కీలక విషయాల్లో కొందరు దేశాధినేతలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. ఇటీవల రష్యా వెళ్లిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ను ఆయన డీఎన్‌ఏను చోరీ చేస్తారనే భయం వెంటాడింది. దీంతో కొవిడ్‌ టెస్టు చేస్తామని రష్యా సిబ్బంది కోరినా నిరాకరించారు. పుతిన్‌తో భేటీ సమయంలోనూ 20 అడుగుల దూరంలో కూర్చొన్నారు. కనీసం చేతులు కూడా కలపకపోవడం గమనార్హం.
Tags:    

Similar News