బైడెన్ బలహీనుడంటే తప్పులో కాలేసినట్లే.. చెప్పిందెవరో తెలుసా?

Update: 2021-06-18 06:30 GMT
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ప్రత్యర్థులు.. బలహీనుడిగా అభివర్ణిస్తారు. ఆయన వయసును ప్రధాన అడ్డంకిగా ఎత్తి చూపుతారు. మొత్తంగా బైడెన్ సరైన ఛాయిస్ కాదన్నట్లుగా వారి మాటలు ఉంటాయి. అయితే.. అంతర్జాతీయ వేదికల మీద మాత్రం బైడెన్ కు పడుతున్న మార్కులు బాగుంటున్నాయి. అన్నింటికి మించి రష్యా అధినేత పుతిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్నాయి.

రష్యాలో తిరుగులేని అధినేతగానే కాదు.. ఎవరికి ఒక పట్టాన కొరుకుడు పడని నేతగా పుతిన్ కు పేరుంది. ఆయన చాలా టఫ్ గా పలువురు చెబుతారు. అలాంటి పుతిన్ ఇటీవల బైడెన్ గురించి మాట్లాడుతూ.. అనుభవం ఉన్న నాయకుడిగా కితాబు ఇవ్వటం తెలిసిందే. జెనీవా శిఖరాగ్ర సదస్సులో చెప్పిన మాటలకు కొనసాగింపుగా తాజాగా బైడెన్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు.

బైడెన్ కు అన్ని విషయాల్లోనూ అవగాహన ఉందని చెప్పారు. ఆయనతో విషయాల్ని చర్చించటం అంత సులువు కాదన్నారు. ఎందుకంటే.. ప్రతి విషయం మీద ఆయనకున్న పట్టే కారణమని చెప్పారు. అంతేకాదు.. తాను సాధించాల్సిందేమిటో బైడెన్ కు బాగా తెలుసని.. ఆ పనిని ఆయన చాలా తెలివిగా పూర్తి చేస్తారని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ గురించి రష్యా అధినేత నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.


Tags:    

Similar News