ఏపీలో కొత్త జిల్లాకు పీవీ పేరు.. టీడీపీ డిమాండ్

Update: 2020-08-29 04:30 GMT
ఆర్థిక సంస్కర్త, మాజీ ప్రధాని పీవీ నరసింహరావు నామస్మరణ పక్కరాష్ట్రానికి పాకింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా పీవీకి భారతరత్న ఇవ్వాలని తీర్మానించడంతోపాటు ఆయన పేరుతో నెక్లస్ రోడ్డుకు పేరు పెట్టారు. ఇక చాలా కార్యక్రమాలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీలోనూ తనదైన ముద్రవేసిన పీవీని ఆంధ్రలోనూ గౌరవించాలనే డిమాండ్ ఊపందుకుంది.

ఏపీలో కొత్త జిల్లాల కోసం అధికారుల కమిటీ అధ్యయనం చేస్తోంది. వచ్చే ఏడాది కల్లా ఏపీలో కొత్త జిల్లాలు కొలువుదీరనున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు కొత్త జిల్లాల డిమాండ్లను వినిపిస్తున్నారు. అందులో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల్లో ఒకదానికి తెలుగు వారందరూ గర్వించదగ్గ పీవీ నరసింహారావు పేరును పెట్టాలని టీడీపీ మద్దతున్న ‘ఇండో అమెరికన్ బ్రాహ్మణ సమాఖ్య’ తాజాగా వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ మేరకు సంఘం చైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు.

పీవీ నరసింహారావు ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఎంపీగా గెలవడం కోసం నంద్యాల నుంచే పోటీచేశారు. తెలుగువాడు ప్రధాని కావాలని నాడు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నంద్యాలలో పోటీ కూడా పెట్టకుండా సహకరించాడు. ఈ క్రమంలోనే ఏపీ ఎంపీగానే ప్రధానిగా పీవీ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాడు. తెలుగువారి కీర్తిని నలుదిశలా వ్యాపింపచేశారు. అందుకే ఆయన పేరు ఏపీ కొత్త జిల్లాకు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.
Tags:    

Similar News