ఆ దేశంలో Q , W , X ను నిషేధించారట !

Update: 2020-10-17 23:30 GMT
ఈ ప్రపంచంలో ఎక్కువమంది మాట్లాడే భాషల్లో ఇంగ్లీష్ మొదటిస్థానంలో ఉంటుంది. కొన్ని కొన్ని దేశాల్లో భాష వేరైనా లిపిని దాదాపుగా లాటిన్‌ ఇంగ్లీష్ ‌లోనే రాస్తుంటారు. అయితే , టర్కీలో కూడా లాటిన్‌ ఇంగ్లీష్‌ అక్షరాలు రాసినప్పటికీ , అక్కడ మరికొన్ని అక్షరాలూ ఉంటాయి. అయితే , కొన్నేళ్ల కిందట Q, W, X అక్షరాలను అక్కడి భాషలో వాడటం టర్కీ ప్రభుత్వం నిషేధించింది. అక్కడి ప్రజల పేర్లలో ఈ అక్షరాలు ఉన్నా.. పలికినా జరిమానా, శిక్షలు విధించేవారట. నిషేధం విధించిన తర్వాత ఆ అక్షరాలు పలకడం కానీ , రాయడం చేసే వారు కాదు. ఇలా కొన్నేళ్ల పాటు కొనసాగిన ఈ నిషేదాన్ని ఎట్టకేలకి 2013లో ఎత్తివేశారు.

అయితే , ఇంగ్లీష్ భాషలో మొత్తం 26 అక్షరాలు ఉంటే , ఈ Q , W , X అసలు ఎందుకు ఈ నిషేధం విధించారు, ఎందుకు ఎత్తివేశారో పూర్తిగా చూద్దాం... టర్కీలో 75 శాతానికిపైగా టర్కీవాసులు, 20శాతం మంది కుర్దులు ఉన్నారు. దీంతో టర్కీ అధికారిక భాష టర్కీష్ ‌తోపాటు కుర్దిష్‌ భాష వాడుకలో ఉంది. రెండు భాషల లిపి ఇంగ్లిష్‌ లో రాస్తే దాదాపు ఒకేలా ఉంటాయి. అయితే, ఈ కుర్దులపై ఒకప్పుడు టర్కీ ప్రభుత్వం బాగా వివక్ష చూపించేదట. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కుర్దిష్‌ భాషను దెబ్బతీయాలని టర్కీ ప్రభుత్వం ప్రయ్నతించేది.

టర్కీలో కుర్దిష్‌ మాట్లాడటం నేరంగా ప్రకటించింది. దీంతో కుర్దులు కూడా అధికారిక భాష టర్కీష్‌ లోనే మాట్లాడాల్సి వచ్చేది. అంతేకాదు, కుర్దిష్‌ ను అణచివేయాలని టర్కీ సర్కార్‌ అధికారిక భాష టర్కీష్‌ లిపిని మార్చింది. కుర్దిష్‌ లో ఎక్కువగా కనిపించే Q, W, X అక్షరాలను టర్కీష్‌ నుంచి తొలగించింది. ఎవరైనా సరే తమ పేర్లలో, లేఖల్లో, ప్రచారంలో ఈ మూడు అక్షరాలను ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. దీంతో అక్కడి ప్రజల గుర్తింపు కార్డుల్లో, ఇతర పత్రాల్లో పేర్లలోని ఆ మూడు అక్షరాలను తీసేసుకున్నారు.

టీవీల్లో, ప్రచార చిత్రాల్లో, నేమ్‌ బోర్డుల్లో ఎక్కడా ఆ అక్షరాలు లేకుండా చేశారు. అందుకే టర్కీలో టాక్సీలకు taxi అని కాకుండా taksi అని రాసి ఉంటుంది. ఈ నిర్ణయంతో కుర్దులు కాస్త ఇబ్బంది పడ్డా అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. అయితే, కాలంతోపాటు టర్కీ ప్రభుత్వంలోనూ మార్పులు వచ్చాయి. ఫలితంగా 2009లో కుర్దిష్‌ భాషలో టీవీ, రేడియో నెట్ ‌వర్క్‌ లు వచ్చాయి. 2013లో Q, W, X అక్షరాలపై నిషేధాన్ని ఎత్తివేశారు. అయినా దేశవ్యాప్తంగా కుర్దులపై వివక్ష.. అక్షరాల నిషేధం కొనసాగుతూనే ఉండటం గమనార్హం.
Tags:    

Similar News