ఖ‌తార్‌ పంచాయ‌తీ కొంప‌ ముంచేలా ఉందే

Update: 2017-06-05 17:03 GMT
అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిణామాలు భార‌త్ పాలిట త‌ల‌నొప్పిగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఖ‌తార్‌ - ఇత‌ర అర‌బ్ దేశాల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు ఇప్పుడు ఇండియా కొంప ముంచేలా క‌నిపిస్తున్నాయి. ఈ దేశాల్లో 80 ల‌క్ష‌ల మంది భార‌తీయులు నివ‌సిస్తుండ‌టంతోపాటు భార‌త ప్ర‌ధాన శ‌క్తి వ‌న‌రు కూడా ఈ దేశాలే. దీంతో వీటి మ‌ధ్య విభేదాలు సాధ్యమైనంత త్వ‌ర‌గా ప‌రిష్కారం కాక‌పోతే.. అది భార‌త్‌ కు తీవ్ర న‌ష్టం క‌లిగించే ప్ర‌మాదం క‌నిపిస్తున్న‌ది. ఖ‌తార్ ఇస్లామిక్ తీవ్ర‌వాదానికి మ‌ద్ద‌తిస్తున్న‌దంటూ.. బ‌హ్రెయిన్‌ - ఈజిప్ట్‌ - సౌదీ అరేబియా - యూఏఈ ఆ దేశంతో ఉన్న అన్ని దౌత్య సంబంధాల‌ను తెంచుకున్న విష‌యం తెలిసిందే. ఖ‌తార్‌ కు వెళ్లే అన్ని ర‌వాణా మార్గాల‌ను నిలిపేయ‌డంతోపాటు త‌మ దేశాల్లో ఉన్న ఖ‌తార్ వాసులు తిరిగి వెళ్లిపోవ‌డానికి రెండు వారాల స‌మ‌యం కూడా ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఖ‌తార్‌లో ఇండియ‌న్స్ చాలా ఎక్కువ‌. అలాగే సౌదీ - యూఈఏల్లోనూ పెద్ద సంఖ్య‌లో భార‌తీయులు ఉన్నారు. ఇప్పుడీ దేశాల మ‌ధ్య విభేదాల‌తో అక్క‌డి ఇండియ‌న్స్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా త‌యారైంది. ఖ‌తార్‌ ను ఒంట‌రిని చేసే ప్ర‌య‌త్నం వ‌ల్ల ఇండియ‌న్స్‌ కు ఇప్ప‌టికిప్పుడు ఈ దేశాల మ‌ధ్య ప్ర‌యాణ స‌మ‌స్య త‌లెత్త‌నుంది. ఇక ఖ‌తార్ నుంచి దిగుమ‌తి చేసుకునే దేశాల్లో భార‌త్‌ ది మూడోస్థానం. లిక్విఫైడ్ నేచుర‌ల్ గ్యాస్ (ఎల్ ఎన్‌ జీ)ని భార‌త్‌ కు అత్య‌ధికంగా స‌ర‌ఫ‌రా చేసే దేశం ఖ‌తారే. ఎల్ ఎన్‌ జీ లో భార‌త్ 65 శాతం అవ‌స‌రాలు ఖ‌తారే తీరుస్తున్న‌ది. ఏడాదికి 75 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ఎల్ ఎన్‌ జీ భార‌త్ దిగుమ‌తి చేసుకుంటున్న‌ది. ఇది కాకుండా ఇథిలిన్‌ - ప్రొపైలీన్‌ - అమోనియా - యూరియా - పాలిథీన్‌ లాంటి వాటిని పెద్ద ఎత్తున ఖ‌తార్ నుంచి ఇండియాకు వ‌స్తున్నాయి.

ఇప్పుడు గ‌ల్ఫ్ దేశాల మ‌ధ్య విభేదాల వ‌ల్ల ఈ దిగుమ‌తుల‌పై ప్ర‌భావం ప‌డ‌నుంది. అంతేకాదు ఏడాదికి వంద కోట్ల డాల‌ర్ల విలువైన ఉత్ప‌త్తుల‌ను కూడా భార‌త్ ఖ‌తార్‌ కు ఎగుమ‌తి చేస్తున్న‌ది. అటు ఎల్ అండ్ టీ, పంజ్ లాయిడ్‌, షాపూర్జీ ప‌ల్లోంజీ గ్రూప్‌ - వోల్టాస్‌ - టీసీఎస్‌ - విప్రో - మ‌హీంద్రా టెక్‌ - హెచ్‌ సీఎల్‌ లాంటి భార‌త దిగ్గ‌జ కంపెనీలు ఖ‌తార్‌ లో సేవ‌లందిస్తున్నాయి. ఈ సంక్షోభం వ‌ల్ల ఈ సంబంధాల‌న్నీ దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంది. దీంతో గ‌ల్ఫ్ దేశాల మ‌ధ్య సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స‌మ‌స్య ప‌రిష్కారం కావాల‌ని భారత్ భావిస్తున్న‌ది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News