ఐటీకి ఆధార్ లింక్‌...కేంద్రం స్కెచ్ వేరే

Update: 2017-04-06 13:44 GMT
ఆధార్‌తో అనుసంధానం అవ‌స‌రం లేద‌ని సుప్రీంకోర్టు స్ప‌స్టం చేస్తున్న‌ప్ప‌టికీ స‌ర్వం ఆధార్ మ‌యం చేసేసిన కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల కొత్త నిబంధ‌న రానున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయితే దీని వెనుక పెద్ద క‌థే ఉంద‌ని అంటున్నారు. ఐటీ రిట‌ర్న్స్‌లో ఆధార్ నంబ‌ర్ పెట్టింది మ‌న‌కు కొన్ని సంక్షేమ ప‌థ‌కాలు క‌ల్పించేందుకు కాదు...ఉన్న‌వి కొన్ని ఊడ‌బీకేందుకు. అది కూడా కీల‌క‌మైన గ్యాస్ స‌బ్సిడీని బాజాపా  తొల‌గించేందుకని అంటున్నారు. వంట గ్యాస్‌ సబ్సిడీలను స్వచ్ఛందంగా వదులుకోవాల్సిందిగా కేంద్ర‌ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే వంట గ్యాస్‌ సబ్సిడీని వదులుకోవడంతో ఇలా కాదని కేంద్రం ఇప్పుడు ఆధార్ కొరడా ఝళిపించడానికి సిద్ధమవుతోంది.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కొద్దికాలం క్రితం గ్యాస్ స‌బ్సిడీని వ‌దులుకోవాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే  ఇన్నాళ్లూ గ్యాస్ సబ్సిడీ వదులుకోవాలా? వద్దా అనే విషయాన్ని దేశ ప్రజల ఇచ్చకు వదిలేసిన కేంద్రం ఇప్పుడు వినియోగదారుల తాట తీయడానికి నేరుగా రంగంలో దిగనుంది. అదే ఐటీకి ఆధార్ అనుసంధానం చేయ‌డం. ఐటీ రిటర్నులలో ఉండే ఆధార్‌ నంబర్‌ సహాయంతో ఇప్పటి వరకూ రేషన్‌ దుకాణాల ద్వారా ప్రభుత్వ సబ్సిడీలను వినియోగించుకుంటున్న వారికి కూడా ప్రభుత్వం త్వరలో చెక్‌ పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త షాక్ ప్ర‌కారం.. సంవత్సర ఆదాయం రూ.10 లక్షలు దాటితే గ్యాస్ సబ్సిడీ వదులుకోవలసిందే. అది కూడా విచక్షణకు వదిలేయకుండా ప్రభుత్వమే గ్యాస్ సబ్సిడీని లాగేసుకుంటుంద‌న్న మాట. ఇది అస‌లు లాజిక్‌.

గ‌త కొన్నేళ్లుగా ప్రభుత్వం సూచన ప్రకారం, గ్యాస్ కంపెనీల అభ్యర్థన ప్రకారం దేశ వ్యాప్తంగా వంట గ్యాస్‌ వినియోగదారులు మూడేళ్లుగా తమ ఆధార్‌ నెంబర్‌ ను అటు బ్యాంకు ఖాతాలతో అనుసంధానమేకాక ఇటు వంట గ్యాస్‌ మార్కెటింగ్‌ సంస్థల వద్ద నమోదు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్ర‌మంలో ఇన్నాళ్లూ ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీని నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తూ వస్తోంది. అయితే ఉద్యోగులు, వ్యాపారుల వార్షిక రాబడి వివరాలను ట్రాక్‌ చేసే వెసులుబాటు లేని కారణంగా, రూ.10 లక్షల వార్షికాదాయం దాటిన వారికి గ్యాస్‌ సబ్సిడీని తొలగించాలన్న ప్రభుత్వ ఆలోచన పెద్దగా కార్యరూపం దాల్చడం లేదు. ఇప్పుడు ఐటి రిటర్నులలో విధిగా ఆధార్‌ సంఖ్య తెలియజేయాలన్న నిబంధన వల్ల ప్రభుత్వం పని మరింత సులభం అవుతుంది. నిర్దేశిత వార్షికాదాయ పరిమితిని దాటిన వారిలో ఎందరు వంట గ్యాస్‌ సబ్సిడీని వినియోగించుకుంటున్నారో ఆధార్‌ నంబర్‌ను బట్టి ప్రభుత్వం ఈజీగా తెలుసుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత ఇంకేముంది ఎంచ‌క్క వారికి చెక్ పెట్టేస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News