వీహెచ్ కు స్పాట్ షాక్ ఇచ్చిన నారాయణమూర్తి!

Update: 2016-10-12 16:18 GMT
కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ నిర్వ‌హిస్తోన్న‌ అల‌య్ బ‌ల‌య్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో వైభవంగా కొనసాగింది! ప్రతి ఏటా దసరా పండుగ సందర్భంగా ద‌త్తాత్రేయ నిర్వ‌హిస్తోన్న‌ ఈ అల‌య్ బ‌ల‌య్ కార్యక్రమానికి పులువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు కు ఆర్. నారాయణ మూర్తికి మధ్య వాడీ వేడీ మాటల యుద్దం జరిగింది!! ముందుగా మాట్లాడిన వీహెచ్... రాయలసీమలోనూ - ఆంధ్రప్రాంతంలోనూ ఇలాంటి సంస్కృతిలేదని, అక్కడ అలయ్ బలయ్ జరపాలని దత్తాత్రేయను - వెంకయ్య నాయుడిని కోరుతున్నట్లు ప్రకటించగా, దానికి ఆర్. నారాయణమూర్తి తనదైన సౌండ్ ఫుల్ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ప్రజల మంచితనం గురించి, అలయ్ బలయ్ గురించి తనదైన శైలిలో మాట్లాడారు. అలయ్ బలయ్ కార్యక్రమంలో ఈ సంఘటన హాట్ టాపిక్ అన్నా అతిశయోక్తి కాదు!

అలయ్ బలయ్ లో మాట్లాడటం మొదలుపెట్టిన వీహెచ్... "కొత్తలో మేము అలై బలై అన్నప్పుడు, ఆంద్రోలన్నారు ఈ అలయ్ బలయ్ ఏందిరా బయ్ అన్నారు - ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం అన్నాము. ఈ సాంప్రదాయం ఆంధ్రలో ఉన్నదో లేదో తెలియదు కానీ వెంకయ్య నాయుడు - సుజనా చౌదరీలకు చెబుతున్నాను - ఎందుకంటే మా దగ్గర ఎంత కొట్లాడుకున్నా - ఎంత తన్నుకున్నా దసరా వచ్చిందంటే అందరం కలిసిపోతాం. కాబట్టి దత్తన్నకు చెబుతున్నా రాయలసీమలో కూడా ఈ అలయ్ బలయ్ ని స్పీడ్ చేయమని. అక్కడ ఒకరినొకరు చూసుకోరు - ఈ అలయ్ బలయ్ అక్కడికీ పోతే వాళ్లలో కాస్త ఆలోచన వస్తుందని. ఇక్కడ ఎంత శతృత్వం ఉన్నా పెళ్లికీ - చావుకీ వెళ్తాం కానీ రాయలసీమలో ఆ ఆనవాయితీ లేదు" అని ముగించారు.

ఇది  అసందర్భమా - అసలు ఇలాంటి తెలిసీ తెలియని విషయాలు వీహెచ్ కు అవసరమా అనే సంగతి కాసేపు పక్కనపెడితే... అదే వేదికపై వీహెచ్ కు తనదైన శైల్లో సమాధానం ఇచ్చేశారు ఆర్. నారాయణమూర్తి.

మొదలుపెట్టడమే హాట్ హాట్ గా మైకు అందుకున్న ఆర్ నారాయణమూర్తి ప్రసంగిస్తూ... "విభిన్న మతాలతో కులాలతో ఉన్న దేశం మన భారతదేశం - భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్న దేశం మన భారతదేశం. అలాంటి భరతదేశంలో హైదరాబాద్ లో అలయ్ బలయ్ జరపడం ఎంతో అవసరం.. ఎందుకంటే ఇది మినీ భారత్" అని మొదలుపెట్టి  వెంటనే రాయలసీమ టాపిక్ కి వచ్చేశారు. "హైదరాబాద్ లోనే కాదు రాయలసీమలో ఈ అలయ్ బలయ్ పెట్టు అంటున్నారు ఈయన (వీహెచ్).. రాయలసీమలో కక్షలూ కార్పణ్యాలే కాదు అంతకు మించి అభిమానాలు - ఆదరణలు కూడా ఉంటాయి" అని వీహెచ్ కు స్పాట్ కౌంటర్ ఇచ్చేశారు.

"రాయలసీమలో ఆగర్భ శతృవైనా ఇంటికి వస్తే క్షమించి - ఆదరించి అలయ్ బలయ్ చేస్తారు. నేను కూడా ఆంధ్రావాడినే అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చా అలయ్ బలయ్ ఇవ్వడానికి" అన్నారు. అప్పటికే వీహెచ్ కి ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చేసిన నారాయణమూర్తి... "కక్షలూ కార్పణ్యాలు ఎక్కడ లేవు? ఆంధ్రలో లేవా, తెలంగాణలో లేవా, యూపీలో లేవా... ఎక్కడలేవు కక్షలూ - కార్పణ్యాలు? కాబట్టి దత్తాత్రేయ గారూ మీరు స్వచ్చ భారత్ ను ఎలా జరిపిస్తున్నారో అలాగే దేశవ్యాప్తంగా ఈ అలయ్ బలయ్ ని జరిపించండి" అని కోరారు!


Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News