చైనాలో మరణ మృదంగం.. ఒక్కరోజే 3.7 కోట్ల కరోనా కేసులు

Update: 2022-12-24 05:34 GMT
కరోనా మరోసారి కోరలు చాస్తోంది. ఈ మహమ్మారి విజృంభించడంతో  కోట్ల కొద్దీ కేసులు నమోదవుతూ.. అసాధారణ మరణాలు సంభవిస్తున్నాయి. డిసెంబర్ చివరి వారంలో ఒక్కరోజే 3.7 కోట్లకు పైగా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చైనా ప్రభుత్వం అంచనా వేస్తోంది. కరోనా పుట్టినిల్లు చైనాలో జీరో కొవిడ్ ఎత్తివేసిన తరువాత రోజురోజుకు పాజిటివ్ ల సంఖ్య పెరిగిపోతోంది. డిసెంబర్ నెల మొదటి 20 రోజుల్లో 248 మిలియన్ల మందికి వైరస్ సోకినట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ అంచనాకు వచ్చినట్లు సమాచారం.

కొవిడ్ 19 మొదలైన తరువాత ఇదే అత్యధిక వ్యాప్తిగా పేర్కొంటున్నారు. పాజిటివ్ కేసులు ఇలా ఉంటే మరణాలు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. వైద్య సదుపాయాలు అందని గ్రామాల్లో మరణాలు సహజంగానే భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం చెప్పిన లెక్కలకు, సంస్థలు అందిస్తున్న నివేదికలకు పొంతన కుదరడం లేదు.

డేటా కన్సల్టెన్సీ సంస్థ మెట్రో డేటాటెక్ చీఫ్ ఎకనమిస్ట్ చెన్  క్వీన్ ప్రకారం.. జనవరి చివరి నాటికి చైనాలోని ప్రధాన నగరాల్లో కరోనా వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అన్నారు. కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడమే ఈ ఉప్పెనకు కారణమని అన్నారు. షెంజాన్, షాంఘై, చాంగ్విన్ నగరాలు కరోనా క్లస్టర్లుగా మారిపోయాయని తెలిపారు.

అయితే ఇంతకాలం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఉన్న కరోనా వ్యాప్తి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ విజృంభిస్తోందన్నారు.  గ్రామాల్లో సరైన వైద్య సదుపాయాలు లేనందున మరణాలు అత్యధికంగా సంభవిస్తున్నాయన్నారు.

గతంలో  కరోనా అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఎన్ హెచ్ ఎస్ చీఫ్ మా జియావోయిని  సూచించారు. కరోనా మరణాల లెక్కింపునకు కొత్త విధానం తీసుకొచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ..వైరస్ వేగంగా వ్యాప్తిస్తున్నందున మరణాలు సహజమన్నట్లు అంగీకరించారు. అయితే కొవిడ్-ప్రేరిత న్యూమొనియాతో మరణించే వారిని మాత్రమే గణాంకాల్లో చేర్చాలని అన్నారు. కానీ చైనా ప్రభుత్వం శ్వాసకోశ వైఫల్యంతో మరణించిన వారిని మాత్రమే లెక్కించాలని తెలిపింది.

ఇదిలా ఉండగా చైనా లెక్కలకు, సంస్థలు అందిస్తున్న నివేదికలకు పొంతన కుదరడం లేదు. ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్ బర్గ్ డిసెంబర్ 20న కేవలం 3,049 కేసులు మాత్రమే నమోదయ్యాయని పేర్కొంది. అలాంటిది ఒక్కరోజులో 3.7 కోట్ల కేసులు ఎలా నమోదవుతాయని ప్రశ్నించారు. కరోనా ఉధృతంగా ఉన్న 2019, 2022లల్లోనే 40 లక్షల కేసులు నమోదయ్యాయని అన్నారు. దీంతో కరోనా కేసుల నమోదుపై అయోమయం నెలకొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News