మోడీ వీపు రాఫెల్ మోత మోగుతోందిగా!

Update: 2018-07-29 04:47 GMT
తాము నీతికి.. నిజాయితీకి నిలువెత్తు రూపంలా చెప్పుకునే మోడీ స‌ర్కారు ఇప్పుడు రాఫెల్ స్కాం రొచ్చులో దిగ‌బ‌డింది. నిజాయితీకి కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న‌ట్లుగా చెప్పుకోవ‌ట‌మే కాదు.. తాము స‌ర్టిఫై చేస్తే.. ఎవ‌రైనా నిజాయితీ ప‌రులే అన్న ఇమేజ్ ను సొంతం చేసుకున్న మోడీ స‌ర్కారుకు ఇప్పుడు రాఫెల్ పుణ్య‌మా అని చుక్క‌లు క‌నిపిస్తున్నాయి.

మిగిలిన కుంభ‌కోణాల‌కు భిన్నంగా రాఫెల్ డీల్ విష‌యంలో త‌ప్పులు ఒక్కొక్క‌టి అన్న‌ట్లుగా క‌నిపిస్తున్న వైనానికి స‌మాధానాలు చెప్ప‌లేని ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్లో బీజేపీ చిక్కుకుంద‌న్న మాట వినిపిస్తోంది. అవినీతి మ‌చ్చ లేని వాళ్ల‌మ‌నే బీజేపీ నేత‌ల‌కు.. అవినీతి మ‌కిలితో కంపు కొట్టే పేరున్న కాంగ్రెస్ కు మ‌ధ్య మొద‌లైన రాఫెల్ వార్ రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

చెప్పుకోవ‌టానికి చిరునామా లేని.. సొంత భూమి అన్న‌ది గ‌జం కూడా లేని అనిల్ అంబానీ కంపెనీకి యుద్ధ విమానాలు త‌యారుచేసే కాంట్రాక్టు క‌ట్ట‌బెట్ట‌టం ఒక ఎత్తు అయితే.. ఇదే రంగంలో పేరు మోసిన ప్ర‌భుత్వ సంస్థ ఉంటే.. దానితో ఎందుకు డీల్ చేయించ‌లేద‌న్న సూటిప్ర‌శ్న క‌మ‌ల‌నాథుల గొంతులో ప‌చ్చి ఎల‌క్కాయ ప‌డిన‌ట్లుగా మారింది. 

రాఫెల్ డీల్ పై ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన సంచ‌ల‌న విష‌యాల‌కు తోడుగా.. ఈ వ్య‌వ‌హారంలో మ‌రేదో జ‌రిగింద‌న్న అనుమానాలు మ‌రింత పెరిగేలా కొన్ని అంశాలు తెర మీద‌కు వ‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో.. రాఫెల్ మీద కాంగ్రెస్ త‌న స్వ‌రాన్ని మ‌రింత పెంచింది. తాము తెర మీద‌కు తెచ్చిన రాఫెల్ డీల్ విష‌యంలో త‌మ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పే స‌త్తా ఉందా? అంటూ క్వ‌శ్చ‌న్ చేసిన తీరు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రాఫెల్ డీల్ విష‌యంలో కొత్త‌గా వ‌చ్చిన అంశాలు ఏమంటే..?

+  భద్రత వ్యవహారాల కేబినెట్‌ కమిటీకి కూడా చెప్పకుండా విదేశీ సంస్థతో ఇంత భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవ‌టం

+  నిజాయితీపరుడైన నాయకుడిగా పేరున్న అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ కి కూడా సంతకానికి వారం రోజుల ముందు మాత్రమే ఈ ఒప్పందం గురించి తెల‌వ‌టం

+ డీల్ స‌మ‌యానికి పారిక‌ర్ గోవా ముఖ్య‌మంత్రిగా వెళ్లిపోవ‌టం

+ రాఫెల్ డీల్ కు వారం ముందు పుట్టిన ఒక కంపెనీకి.. డీల్ కుదిరిన రెండు వారాల త‌ర్వాత పుట్టిన మ‌రో కంపెనీకి దేశ భ‌ద్ర‌త‌కు సంబంధించిన కీల‌క బాధ్య‌త‌ను క‌ట్ట‌బెట్ట‌టం

+  అసలు యుద్ధ విమానాలంటే తెలీని అనిల్‌ అంబానీ సంస్థ ఆర్‌డీఎల్‌కు కాంట్రాక్ట్‌ దక్కేట్లు చూడ‌టం ఎందుకు?

+ రాఫెల్‌ విమానాలు కొంటున్నట్లు ప్రధాని మోదీ 10-04-2015న పారిస్ లో ప్రకటించారు. మోడీ నోటి నుంచి మాట వ‌చ్చిన 14 రోజుల త‌ర్వాత రిల‌య‌న్స్ ఏరో స్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ అనే మ‌రో సంస్థ పుట్టుకొచ్చింది. ఆర్ డీఎల్‌ కు అనుబంధ సంస్థ ఈ ఆర్ ఏఎల్ ద్వారా యుద్ధ విమానాల త‌యారీ జ‌రుగుతుంద‌ని చెప్పారు.

+ ర‌క్ష‌ణ శాఖ స్వ‌యంగా క‌ట్ట‌బెట్టిన ఈ కాంట్రాక్టు వ‌చ్చే నాటికి రిల‌య‌న్స్ కు ఆర్ ఏఎల్ కు సొంతంగా భూమి కానీ.. క‌నీసం సొంతంగా ఒక భ‌వనం కానీ లేవు.

+ యుద్ధ విమానాల తయారీ నిమిత్తం పెట్టుకున్న లైసెన్స్‌ దరఖాస్తు సైతం సందేహాలు పెంచేలా ఉంది.  ఆర్ ఏఎల్‌ ఇచ్చిన చిరునామా గుజరాత్‌ లోని ఒక మారుమూల గ్రామంలో ఉంది. ఆ చిరునామాలో సంస్థ కార్యాలయం లేనేలేదు. పిపావవ్‌ డిఫెన్స్‌ అండ్‌ ఆఫ్‌ షోర్‌ ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే వేరే సంస్థ ఉంది. ఆఖరికి లైసెన్స్‌ మంజూరు చేసే నాటికి (22-02-2016) కూడా ఆర్ఏఎల్‌ కు సొంత జాగా లేదు.

+ యుద్ధ విమానాల తయారీ ఒప్పందాన్ని ఆర్ ఏఎల్‌కు కట్టబెట్టిన ప్ర‌భుత్వం.. స‌ర్కారుకు చెందిన  ప్రభుత్వ రంగ సంస్థ  హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్ ఏఎల్‌)కు ఈ అతి పెద్ద రక్షణ ఒప్పందం దక్కకుండా ఎందుకు చేశారు?

+ యుద్ద విమానాల త‌యారీలో హెచ్ ఏఎల్‌ కు ఉన్నంత అనుభవం ఆర్ ఏఎల్‌కు ఉందా?

రాఫెల్ డీల్ పై కాంగ్రెస్ సంధిస్తున్న క్వ‌శ్చ‌న్లు చూస్తే..

 = రక్షణ మంత్రి అనుమతి లేకుండా అనిల్‌ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్‌ డిఫెన్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ డీఎల్‌), రాఫెల్‌ విమానాలు తయారుచేసే దసాల్ట్‌ సంస్థ రూ 30,000 కోట్ల ఆఫ్‌ సెట్‌ కాంట్రాక్ట్‌ పై సంతకం చేయగలవా?

= ఈ ఆఫ్‌ సెట్‌ కాంట్రాక్ట్‌ పై రక్షణ మంత్రిత్వ శాఖ.. ఓకే చెబుతూ ప్రతి సంతకం చేసిందా?

= రక్షణ శాఖ గతంలో తయారుచేసిన డిఫెన్స్‌ ఆఫ్‌ సెట్‌ కాంట్రాక్ట్‌ మార్గదర్శకాలను ఎందుకు అనుసరించలేదు?

= ర‌క్ష‌ణ శాఖ మార్గదర్శకాలు అమలవుతున్నాయో లేదో ప్రతీ ఆర్నెల్లకోసారి డిఫెన్స్‌ ఆఫ్‌సెట్‌ మేనేజ్‌ మెంట్‌ వింగ్ ఆడిట్ ఎందుకు చేయ‌లేదు?

= విమానాలను కొంటున్న విషయాన్నిరక్షణ సేకరణ మండలికి తెలిపారా?

= యుద్ధ విమానాల తయారీలో ఆర్‌డీఎల్‌ కు అసలు అనుభవం ఉందా?

= ఆర్‌డీఎల్‌ ను భాగస్వామిగా డసాల్ట్‌ ఎంచుకున్నపుడు రక్షణ శాఖ జోక్యం చేసుకుని ఆర్‌డీఎల్‌కు ఉన్న అర్హ‌త ఏమిట‌న్న‌ది చెప్పిందా?

= కాంగ్రెస్‌ హయాంలో రూ.526 కోట్లకు ఒక విమానం చొప్పున ఒప్పందం ఖరారైన విమానాలనే మోదీ సర్కారు రూ.1600 కోట్లకు ఓకే ఎందుకు చేసిన‌ట్లు?

= ఒప్పందం ఆలస్యం కాకూడ‌ద‌ని అంత భారీ వ్య‌త్యాసంతో కొనాల్సిన అవ‌స‌రం ఉందా?
Tags:    

Similar News