రివర్స్ లో మట్టి.. నీళ్లు పంపుతారట

Update: 2015-10-24 10:20 GMT
రాష్ట్ర విభజన సమయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు కిమ్మనకుండా ఉన్న సంగతి తెలిసిందే. పదేళ్లు నాన్ స్టాప్ అధికారం చెలాయించిన వారికి.. ఓదశలో విపక్షంలో కొన్నాళ్లు ఉందామన్న మాట కూడా వినిపించేవారు. చివర్లో రాష్ట్ర విభజనపై ఏపీ నేతల మాటల్ని ఏ మాత్రం లక్ష్యపెట్టని కాంగ్రెస్ అధినాయకత్వం తానేం చేయాలో అదే చేసేసింది. విభజన నిర్ణయం తీసుకొని అరవయ్యేళ్లే పంచాయితీనికి ఒక కొలిక్కి తీసుకొచ్చింది.

విభజన సందర్భంగా ఏపీ ప్రజల ప్రయోజనాల గురించి ఏ మాత్రం పట్టించుకోని ఏపీ కాంగ్రెస్ నేతలు ఐదు కోట్ల సీమాంధ్రుల భవిష్యత్తును పణంగా పెట్టిన పరిస్థితి. ఈ వైఖరితో విభజన సమయంలో ఏపీకి ఎంతో నష్టం వాటిల్లింది. సమీప భవిష్యత్తులో కోలుకోలేని దుస్థితి. ఈ కారణంతోనే.. ఏపీ కాంగ్రెస్ను పాతాళానికి తొక్కేసిన సీమాంధ్ర ప్రజలు మళ్లీ కోలుకోకుండా చేశారు.

చేతిలో అధికారం చేజారిన తర్వాత.. సమీప భవిష్యత్తులో పవర్ చేతికి వచ్చే సూచనలు కనిపించకపోవటంతో.. పవర్ మీద మోజు పెరిగింది. అందుకే.. పోయిన చోటు వెతుక్కునే చందంగా ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టారు. అయితే.. విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చేందుకు మోడీ సర్కారు సిద్ధంగా లేకపోవటం కాంగ్రెస్ కు కలిసొస్తుంది.

ఏపీ మీద తమకున్న ప్రేమను ఎప్పటికప్పుడు ఒలకబోస్తూ.. ఏపీ అభ్యున్నతి కోసం.. అభివృద్ధి కోసం తాము ఎంతగా తపిస్తున్నామో చెప్పే ప్రయత్నాల్ని ఈ మధ్యన పెంచారు. ఇదిలా ఉంటే.. అమరావతి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ ఎలాంటి హామీలు ఇవ్వకపోటం.. వరాలు కురిపించకపోవటంతో ఏపీ కాంగ్రెస్ నేతలు చెలరేగిపోతున్నారు.

మన మట్టి.. మన నీరు.. మన అమరావతి కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ పార్లమెంటు ఆవరణలోని పుట్టమట్టి.. పవిత్ర యమున నదీ జలాల్ని తీసుకొచ్చి చంద్రబాబు చేతిలో పెట్టి.. ఇంకెలాంటి ప్యాకేజీ ప్రకటించకుండా తన దారిన తాను వెళ్లపోవటం తెలిసిందే. దీంతో మట్టి.. నీళ్లు ఇచ్చిన మోడీకి అదే తీరులో షాక్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో రివర్స్ గేర్ కార్యక్రమం మొదలు పెట్టారు ఏపీ కాంగ్రెస్ నేతలు.

మోడీ మీద చేపట్టే నిరసన కార్యక్రమం వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేశారు. క్రియేటివ్ గా ఆలోచించిన ఏపీ కాంగ్రెస్.. ఏపీలోని అన్ని గ్రామాల మొదలు అన్ని చోట్ల నుంచి మట్టి.. నీటిని సేకరించి మోడీకి పంపనున్నట్లు వెల్లడించారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. మట్టి సత్యాగ్రహం పేరిట నిర్వహిస్తున్న నిరసన ఎలాంటి రిజల్ట్ ను ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News