తేనెతుట్టెను కదిపిన రాహుల్‌.. కేసులపై కేసులు!

Update: 2022-11-18 08:29 GMT
కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాదయాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో సాగుతోంది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రాహుల్‌ పాదయాత్ర ముగిసింది.

కాగా రాహుల్‌ తన భారత జోడో యాత్రలో భాగంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కార్‌పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీర సావర్కార్‌ బ్రిటిష్‌ వాళ్లను క్షమాభిక్ష అడిగారని రాహుల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గాంధీ, నెహ్రూ, వల్లబాయ్‌ పటేల్‌ వీళ్లెవరూ క్షమాభిక్ష కోరలేదని.. వీర సావర్కార్‌ మాత్రం బ్రిటిష్‌ వాళ్లకు క్షమాపణ వేడుకున్నాడని రాహుల్‌ ఆరోపించారు. దీనిపై తీవ్ర స్థాయిలో బీజేపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తినా రాహుల్‌ లెక్కచేయలేదు. వీర సావర్కార్‌ బ్రిటిష్‌ వాళ్లకు పెట్టుకున్న క్షమాభిక్ష డాక్యుమెంట్‌ను కూడా ఆయన మీడియా ఎదుట ప్రవేశపెట్టారు.

మరోవైపు వీర సావర్కార్‌ మహారాష్ట్రకు చెందినవారు కావడం, బీజేపీ ఆరాధించే వ్యక్తుల్లో ఒకరు కావడంతో బీజేపీ నేతలు రాహుల్‌గాంధీపై మండిపడ్డారు. అంతేకాకుండా ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. రాహుల్‌ గాంధీ.. వీర సావర్కార్‌ను అవమానించారంటూ ఫిర్యాదులు చేశారు.

ఇంకోవైపు వీర సావర్కార్‌ ముని మనుమడు రంజిత్‌ సావర్కర్, శివసేన ఎంపీ రాహుల్‌ షెవాలే.. రాహుల్‌ గాంధీపై ముంబై శివాజీ పార్క్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వాతంత్య్ర సమరయోధులను రాహుల్‌ కించపరిచారంటూ ఫిర్యాదు చేశారు.

మరోవైపు సావర్కర్‌ హిందుత్వ విధానాలను బలంగా నమ్మే పార్టీ.. శివసేన. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండేకు బాలాసాహెబాంచి శివసేన నాయకులు సైతం పోలీసులకు రాహుల్‌పై ఫిర్యాదు చేశారు. శివసేన నేత సుహాస్‌ డోంగ్రేతో మరికొందరు తమ ఫిర్యాదులో రాహుల్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు థానే నగర్‌ పోలీసుస్టేషన్‌లో తమ ఫిర్యాదు అందజేశారు.

రాహుల్‌ గాంధీ.. స్వాతంత్య్రసమరయోధులను కించపరిచారుఅంటూ  ఆయనపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 500, 501 న మోదు చేశారు. మహారాష్ట్రకు చెందిన సావర్కర్‌ను రాహుల్‌ అవమానించారని శివసేన నాయకులు ఆరోపించారు. రాహుల్‌గాంధీ జోడో యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. రాహుల్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News