రాహుల్ కు అక్కడ ఓటమి ఖాయమా!

Update: 2019-04-02 17:30 GMT
రాజకీయంలో గెలుపు ఓటములకు ఎవరూ అతీతులు కాదు. రాహుల్ ఓడిపోతాడా అంటూ ఎవరూ నోర్లు తెరవనక్కర్లేదు. రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీనే ఒకసారి ఎంపీగా ఓడిపోయారు. అలాంటిది రాహుల్ ఓడిపోవడంలో మరీ విడ్డూరం ఏమీ ఉండకపోవచ్చు. అమేఠీలో రాహుల్ కు ఓటమి భయం అనే ప్రచారం అయితే ఒకటి  మొదలైంది!

అందుకే ఆయన వయనాడ్ నుంచి పోటీకి రెడీ అయ్యారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాహుల్ వ్యతిరేకులు  ఈ వాదనను  రైజ్ చేస్తూ ఉన్నారని అనుకోవచ్చు.అయితే గత కొన్నా పర్యాయాల ఫలితాలను చూస్తుంటే.. అమేఠీలో రాహుల్ మెజారిటీ క్రమక్రమంగా తగ్గుతూవస్తోంది. అమేఠీ గాంధీ- నెహ్రూ కుటుంబీకులకు ఆటపట్టు అయిన ప్రాంతం. ఆ సీటు నుంచి ఆ కుటుంబీకుల్లో ముఖ్యులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. గెలుస్తూ వస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా పదిహేనేళ్లుగా అమేఠీ ఎంపీగా ఉన్నారు.

అందులో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండింది. అయినా అమేఠీలో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. రాహుల్ లాంటి నేత ఇన్నేళ్లూ ప్రాతినిధ్యం వహిస్తున్నాడంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉండాలని జనాలు అంచనా వేస్తారో అందరికీ తెలిసిందే. కానీ అక్కడేమీ అంత సీన్ లేదు.

మరోవైపు గత ఎన్నికల్లో రాహుల్ కు వచ్చిన మెజారిటీ లక్ష ఓట్ల చిల్లర మాత్రమే. అదేమీ పెద్ద మెజారిటీ కాదు. ఇక గత ఎన్నికల్లో గెలిచాకా రాహుల్ ఎన్ని సార్లు అమేఠీ వెళ్లారో తెలియదు కానీ..ఆయన చేతిలో అప్పుడు ఓడిపోయిన స్మృతీ ఇరానీ మాత్రం అమేఠీ పర్యటనలు పెట్టుకుంటూనే ఉన్నారు. స్థానిక ప్రజల వద్దకు వెళ్లికేంద్రమంత్రిగా అభివృద్ధి మంత్రం వేస్తూ ఉన్నారు.  

అలాగే ఆ నియోజకవర్గం పరిధిలోని బీజేపీ కార్యకర్తలతో టచ్లో ఉంటారట ఆమె. ఇప్పుడు మరోసారి పోటీకి, భారీ ఎత్తున అక్కడ ప్రచారం చేయడానికి స్మృతి రెడీ అయిపోతూ ఉంది. ఇలాంటి నేఫథ్యంలో అక్కడ ఈ సారి రాహుల్ కు టఫ్ ఫైట్ తప్పదని తెలుస్తోంది. రాహుల్ గెలవడం పెద్ద కథ ఏం కాకపోవచ్చు. అయితే గట్టి పోటీ ఉంటుందనే పరిస్థితి అయితే వచ్చింది. ఆ భయంతోనే రాహుల్ మైనారిటీల జనాభా గణనీయంగా ఉండే వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ వాళ్లు ఎద్దేవా చేస్తూ ఉన్నారు!
Tags:    

Similar News