రాహుల్‌ కు త‌ప్పిన పెను ప్ర‌మాదం!

Update: 2018-04-27 04:49 GMT
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పెను ప్ర‌మాదం నుంచి తృటిలో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న విమానంలో ఏర్ప‌డిన సాంకేతిక స‌మ‌స్య‌లు ఒళ్లు గ‌గుర్పాటుకు గురి చేయ‌ట‌మే కాదు.. ఈ మొత్తం ఉదంతంలో ఏమైనా కుట్ర కోణం దాగి ఉందా? అన్న‌ది ఇప్పుడు సందేహం మారింది. ప్రైవేటు విమానంలో చోటు చేసుకున్న సాంకేతిక స‌మ‌స్య వెనుక కుట్ర ఏమైనా దాగి ఉందా? అన్న డౌట్‌ ను కాంగ్రెస్ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

సందేహంగానే మిగ‌ల్చ‌కుండా.. త‌మ‌కు డౌట్ ను కంప్లైంట్ రూపంలో పోలీసుల‌కు అందించారు రాహుల్ టీం స‌భ్యుడు ఒక‌రు. రాహుల్ కు ముప్పు త‌ప్పిన విమాన ప్ర‌యాణం వివ‌రాల్లోకి వెళితే.. గురువారం ఉద‌యం ఒక ప్రైవేటు ఛార్టెర్డ్ ఫ్లైట్ లో ఢిల్లీ నుంచి క‌ర్ణాట‌క‌కు బ‌య‌లుదేరారు రాహుల్ గాంధీ.

హుబ్బ‌ళికి చేరాల్సిన రాహుల్ విమానం మ‌ధ్య‌లో సాంకేతిక స‌మ‌స్య‌కు గురైంది. ఉద‌యం 10.45 గంట‌ల స‌మ‌యంలో విమానం పెద్ద శ‌బ్దం చేస్తూ కుదుపుల‌కు లోనుకావ‌టం.. ఒక‌వైపున‌కు ఒరిగిపోవ‌టంతో విమానంలో ప్ర‌యాణిస్తున్న వారి గుండెల్లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మైన‌ట్లుగా చెబుతున్నారు. ఒక‌ప‌క్క‌గా జారిపోవ‌టంతోపాటు.. విమానం మొత్తం అటూఇటూ అన్న‌ట్లు ఊగిపోవ‌టం.. భారీ శ‌బ్దం రావ‌టంతో పైలెట్లు తీవ్ర ఆందోళ‌న‌కు గురైన‌ట్లు తెలుస్తోంది.

విమానాన్ని కంట్రోల్ చేయ‌టానికి పైలెట్లు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. తీవ్ర ఆందోళ‌న‌ల మ‌ధ్య దాదాపు 40 నిమిషాల పాటు విమాన ప్ర‌యాణం సాగిన‌ట్లుగా చెబుతున్నారు. దాదాపు న‌ల‌భై నిమిషాల పాటు త‌మ ప్రాణాలు గాల్లోనే ఉన్న‌ట్లుగా విమానంలో ప్ర‌యాణించిన వారు చెప్ప‌టం గ‌మ‌నార్హం.

విమానంలో క్రూ మెంబ‌ర్ల‌తో స‌హా అంద‌రూ తీవ్ర ఆందోళ‌న‌ల‌కు గురి అవుతున్న వేళ‌.. రాహుల్ మాత్రంప్ర‌శాంతంగా ఉన్నార‌ని.. ఎలాంటి ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌టం లేద‌ని చెబుతున్నారు.

రాహుల్ ఇంత కూల్ గా ఉంటే.. ఆయ‌న టీంలోని స‌భ్యుడు కౌశ‌ల్ విద్యార్థి మాత్రం.. త‌న జీవితంలో అత్యంత భ‌యాన‌క‌మైన రోజుగా అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం. విమానంలో స‌మ‌స్య త‌లెత్త‌టం వెనుక ఏదైనా కుట్ర ఉందా? అన్న సందేహాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే.. ఆటో పైలట్ మోడ్ లో ఉండ‌టంతోనే స‌మ‌స్య త‌లెత్తిన‌ట్లుగా పౌర విమాన‌యాన నియంత్ర‌ణ సంస్థ వెల్ల‌డించింది. అయిన‌ప్ప‌టికీ ఈ ఉదంతంపై తాము ద‌ర్యాప్తు జ‌రుపుతామ‌ని పేర్కొంది. ఏమైనా.. ఒక ప్ర‌ముఖ వ్య‌క్తి ప్ర‌యాణిస్తున్న విమానంలో సాంకేతిక స‌మ‌స్య ఎదురుకావ‌టం నిఘా వ‌ర్గాలు.. అధికార వ‌ర్గాలు మ‌రింత అలెర్ట్ కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News