ఇప్పుడీ డ్రామాలెందుకు రాహుల్‌ జీ?

Update: 2015-10-22 03:59 GMT
రాహుల్ గాంధీ మళ్లీ నోరు విప్పారు. తన నేతృత్వంలో పార్టీకి కలిగిన వరుస పరాజయాలతో మాట పడిపోయి మౌనం పాటిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ తాజాగా ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించవలసిందిగా కోరుతూ ప్రధాని మోదీకి ఉత్తరం రాశారు. ఆంధ్రప్రదేశ్‌ ను ఎంతగా సర్వనాశనం చేయాలో అంతా చేసి తగుదునమ్మా అంటూ ఇప్పుడు మళ్లీ ప్రేమ ఒలకపోయడం ఏపీ ప్రజలకు నవ్వు తెప్పిస్తోంది.

ఇంతకూ ఆ ఉత్తరంలో రాహుల్ ఏమని రాశారు? నూతన రాజధాని అమరావతి శంకుస్థాపనకు మీరు వెళుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి నిర్దేశించిన అన్ని సౌకర్యల కల్పనతో పాటు ప్రత్యేక హోదా ప్రతిపత్తిని కూడా కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. గత సంవత్సరం నేను ఆంధ్రప్రదేశ్‌ ను సందర్శించాను. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కేంద్రం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, బాధను చూశాను. ఈరోజు ఏపీ తీవ్రమైన ఆదాయ లోటును ఎదుర్కొంటోంది. అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా స్తంభించిపోయాయి. ఇంత తీవ్ర పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం నేటికీ మద్దతును ఇవ్వడం లేదు. అని మోదీకి రాసిన లేఖలో రాహుల్ విమర్శించారు.

రాహుల్ రాసిన లేఖ సారాంశం కచ్చితంగా బీజేపీకి - టీడీపీకి తలనొప్పి తెచ్చిపెడుతుందనటంలో సందేహం లేదు. కాని అదేసమయంలో రాహుల్  నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపట్ల నిజాయితీతో ఉన్నారా అనేదే సందేహంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా నడుచుకుని రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన పాపం కాంగ్రెస్‌దే. కానీ ప్రజల సంక్షేమం అనీ ప్రత్యేక హోదా అని ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా ఎందుకు మొదలెడుతున్నట్లు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రాహుల్ వ్యవహారం చూస్తుంటే ఒక వ్యక్తిని ముందుగా కత్తితో పొడిచి, తర్వాత రోగికి సరైన వైద్య సౌకర్యం కల్పించలేదని ఆరోపించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రానికి విభజన పేరుతో చేసిన అన్యాయం పట్ల కనీసం పశ్చాత్తాపం ప్రకటించకుండా ఇప్పుడు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్లు నోరు చించుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం.? మీరెన్ని గావుకేకలు పెట్టినా ఆంధ్రప్రదేశ్‌ లో భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ బట్టటం మాత్రం జరగని పని.
Tags:    

Similar News