సాక్షిగా ఆదుకున్న రాజ‌మ్మను రాహుల్ క‌లిశాడబ్బా

Update: 2019-06-09 10:12 GMT
నువ్వా, నేనా అన్న రీతిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ... అస‌లు పోటీలో నిలిచే అర్హ‌త సాధిస్తారా? అన్న అనుమానాలు రేకెత్తాయి. ఎందుకంటే... రాహుల్ పౌర‌స‌త్వంపై వ‌చ్చిన విమ‌ర్శ‌లు, న‌డిచిన వివాదం కాంగ్రెస్ పార్టీ నేత‌ల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింద‌నే చెప్పాలి. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో రాజ‌మ్మ అనే మ‌హిళ ఇచ్చిన సాక్ష్యం రాహుల్ కు కొండంత అండ‌నిచ్చింది. రాహుల్ నామినేష‌న్ కు గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించింది. అయితుఏ ఆ నామినేష‌న్ వేసిన చోట రాహుల్ గాంధీ ఓడిపోయారనుకోండి. అది వేరే విష‌యం. అస‌లు పోటీలో లేకుండా పోతే చేసేదేంటీ?  నిజ‌మే.. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉండి కూడా నామినేష‌న్ వేయ‌లేక‌పోతే ప‌రిస్థితి ఏంటి? అయితే రాహుల్ ను ఆ ఉపద్ర‌వం నుంచి కాపాడిన మ‌హిళ అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది.  

ఆమె వేరెవ‌రో కాదు... రాహుల్ తొలిసారిగా ద‌క్షిణాది నుంచి పోటీ చేసిన వాయ‌నాడ్ కు చెందిన మ‌హిళ‌. అంతేనా... రాహుల్ పుట్ట‌గానే చేతుల్లోకి తీసుకుని స‌ప‌ర్య‌లు చేసిన న‌ర్సుల‌లో ఒక‌రు. స‌రే... ఇదంతా తెలిసిన విష‌యం అనుకుంటే... మొన్న త‌న‌ను పెద్ద ఉప‌ద్రవం నుంచి కాపాడిన మహిళ‌ను ఇప్పుడు రాహుల్ గాంధీ స్వ‌యంగా క‌లిశారు. అందుకే ఇప్పుడు రాజ‌మ్మ‌తో రాహుల్ గాంధీ భేటీ అందరినీ ఆక‌ట్టుకుంది. రాహుల్ ముమ్మాటికీ భార‌తీయుడేన‌ని సాక్ష్యం చెప్పిన మ‌హిళ‌, మాజీ న‌ర్సు పేరు రాజ‌మ్మ‌. వ‌య‌నాడ్ లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన ఈమె... రాహుల్ కు సోనియా గాంధీ జన్మ‌నిచ్చిన ఢిల్లీలో హోలీ ఫ్యామిలీ ఆసుప‌త్రిలో న‌ర్సుగా ప‌నిచేసింది. అయితే ఆ త‌ర్వాత ఆ ఆసుప‌త్రి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి భార‌త సైన్యంలో చాలా కాలం పాటు విధులు నిర్వ‌ర్తించి ఇప్పుడు సొంతూళ్లో వ‌య‌సు ఉడిగిన స్థితిలో సేద దీరుతోంది.

మొన్న ఎన్నిక‌ల సంద‌ర్భంగా రాహుల్ పౌర‌స‌త్వంపై అల‌జ‌డి రేగితే... ఏ ఒక్క‌రూ అడ‌గ‌కుండానే మీడియా ముందుకు వ‌చ్చి... రాహుల్ ముమ్మాటికీ భార‌తీయుడేన‌ని, పొత్తిళ్ల‌లో రాహుల్ ను ముద్ద చేసిన తానే అందుకు సాక్షి అంటూ రాజ‌మ్మ చెప్పారు. ఆ తర్వాత ఆమె సాక్ష్యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారో, లేదో తెలియ‌దు గానీ... రాహుల్ నామినేష‌న ను అమేధీ రిట‌ర్నింగ్ అధికారి ఆమోదించారు. అయితే అమేధీలో ఓడిన రాహుల్‌... వ‌య‌నాడ్ లో గెలిచారు. గెలిచాక త‌నను గెలిపించిన ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునేందుకు వెళ్లిన రాహుల్‌... త‌న పౌర‌స‌త్వంపై వెల్లెవెత్తిన విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేసిన రాజ‌మ్మ విష‌యం తెలుసుకుని ఆమె వ‌ద్దకు వెళ్లార‌ట‌. రాజ‌మ్మ విష‌యం తెలుసుకున్న రాహుల్‌... ఆమెకు స‌ర్ ప్రైజ్ ఇవ్వాల‌న్న ఉద్దేశంతో నేరుగా ఆమె ఇంటికి వెళ్లార‌ట‌. రాజమ్మను ఆప్యాయంగా పలకరించిన రాహుల్ గాంధీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. రాహుల్ గాంధీ తన ఇంటికి వస్తారని కలలో కూడా ఊహించలేదని, ఇప్పుడది నిజమైందని రాజ‌మ్మ‌ సంతోషం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News