క‌ర్ణాట‌క‌లో మోదీ 'గ‌బ్బ‌ర్ సింగ్' గ్యాంగ్:రాహుల్!

Update: 2018-05-05 08:42 GMT

కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ పెట్టిన జీఎస్టీని ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. జీఎస్టీ అంటే గ‌బ్బ‌ర్ సింగ్ ట్యాక్స్ అని...ప్ర‌జ‌ల‌ను దోచుకునేందుకే మోదీ...దానిని ప్ర‌వేశ‌పెట్టార‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. తాజాగా, మ‌రోసారి రాహుల్...గబ్బ‌ర్ సింగ్ ప‌దంతో మోదీపై విరుచుకుప‌డ్డారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో గ‌బ్బ‌ర్ సింగ్ గ్యాంగ్ ను దించేందుకు మోదీ వ్యూహాలు ర‌చించార‌ని రాహుల్ ...ఎద్దేవా చేశారు. అవినీతిప‌రులైన వ్య‌క్తుల‌ను అసెంబ్లీలో కూర్చోబెట్టాల‌ని మోదీ ఉవ్విళ్లూరుతున్నార‌ని....మోదీ చెప్పిన అవినీతిర‌హిత భారతం ఇదేనా అంటూ దుయ్య‌బ‌ట్టారు. అంతేకాకుండా, 15 నిమిషాల పాటు క‌ర్ణాట‌క అభివృద్ధిపై మాట్లాడేందుకు తాను సిద్ధ‌మ‌ని మోదీ స‌వాల్ ను రాహుల్ స్వీక‌రించారు. దాంతోపాటు....అవినీతిప‌రులైన బీజేపీ నేత‌ల గురించి 15 నిమిషాల పాటు మోదీ ప్ర‌సంగించాల‌ని రాహుల్ స‌వాల్ విసిరారు. కలబురిగి - గడగ్‌ - హవేరీ జిల్లాల్లో శుక్ర‌వారం నాడు పర్యటించిన రాహుల్ బీజేపీపై నిప్పులు చెరిగారు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పోలింగ్ తేదీకి మ‌రో వారం రోజులే గ‌డువుండ‌డంతో కాంగ్రెస్ - బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం తార‌స్థాయికి చేరుకుంది. మోదీ - బీజేపీ నేతలపై రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. ప్రధాని పార్టీలో గబ్బర్‌ సింగ్‌ గ్యాంగ్ ఉంద‌ని, ‘షోలే’ చిత్రంలో లాగా మోదీ గ్యాంగ్‌లో గబ్బర్‌, సాంబ, కాలియా వంటి వాళ్లు చాలామంది ఉన్నార‌ని రాహుల్ ఎద్దేవా చేశారు. మోదీ ప్ర‌భుత్వంలో అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని, ...అవినీతిప‌రుల‌కు టిక్కెట్లు ఇస్తూ....దేశాన్ని అవినీతి రహితం చేస్తానని హామీలివ్వ‌డం హాస్యాస్పదమ‌ని అన్నారు. మోదీ స‌వాల్ ను స్వీక‌రిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు. అవినీతిపరులైన గాలి బ్రదర్స్ కు అత్యంత సన్నిహితులైన 8 మందికి టికెట్లు ఇచ్చారని, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పపై చీటింగ్‌, అవినీతి, ఫోర్జరీ వంటి 23కేసులున్నాయని రాహుల్ అన్నారు.

దాంతో పాటు బీజేపీలోని 11మంది అగ్రనేతల అవినీతిపై 5 నిమిషాల పాటు ప్ర‌సంగించ‌గ‌ల‌రా అంటూ మోదీకి స‌వాల్ విసిరారు. మోదీ స‌మాధానం కోసం తాను ఎదురుచూస్తుంటాన‌ని, కావాలంటే చేతిలో పేపర్‌ పట్టుకునే సమాధానం చెప్పొచ్చని ట్వీట్ చేశారు. తాను మాట్లాడిన త‌ర్వా మోదీకి క‌ర్ణాట‌క‌లో ప‌ని ఉండ‌ద‌ని, త‌న‌కు భయపడే వ్య‌క్తిగత విమర్శలకు దిగుతున్నార‌ని రాహుల్ అన్నారు.  ప్ర‌జ‌లంతా ఐకమత్యంగా ఉండాలనే కాంగ్రెస్ సిద్ధాంతానికి, ఆర్ఎస్ఎస్ క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తోన్న బీజేపీ సిద్ధాంతానికి మ‌ధ్య ఈ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని రాహుల్ అన్నారు. కర్ణాటకలోని 224అసెంబ్లీ స్థానాలకు గానూ ఈనెల 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 15న ఫ‌లితాలు వెలువడనున్నాయి.



Tags:    

Similar News