క‌రుణ తాజా ఫోటోల‌తో త‌మిళుల క‌న్నీరుమున్నీరు!

Update: 2018-08-01 06:21 GMT
త‌మిళుల అభిమానాన్ని పొంద‌టానికి మించిన వ‌రం మ‌రింకేమీ ఉండ‌దేమో. తాము అభిమానించిన వారిని మ‌రెక్క‌డా లేని విధంగా గుండెల్లో పెట్టుకొని చూసుకోవ‌టంలో త‌మిళుల త‌ర్వాతే ఎవ‌రైనా. త‌మిళులు ఎవ‌రినైనా అభిమానించినా.. ఆరాధించినా అదంతా సో స్పెష‌ల్ గా ఉంటుంది. తామెంతో అభిమానించే వారి ఆరోగ్యానికి ఏదైనా అయితే.. త‌మిళులు అస్స‌లు త‌ట్టుకోలేరు. తాజాగా డీఎంకే చీఫ్ క‌రుణానిధి విష‌యంలో ఈ విష‌యం మ‌రోసారి రిపీట్ అయ్యింది.

తీవ్ర అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన క‌రుణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి మెరుగు అవుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం క‌రుణ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని.. చికిత్స‌కు చ‌క్క‌గా స్పందిస్తున్న‌ట్లుగా కావేరీ ఆసుప‌త్రి వ‌ర్గాలు ప్ర‌క‌టిస్తున్నాయి.

పెద్ద వ‌య‌సులో ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న క‌రుణ‌ను మ‌రికొన్ని రోజుల పాటు ఆసుప‌త్రిలో ఉండాల్సి వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. క‌రుణ‌ను ప‌రామ‌ర్శించ‌టానికి ప్ర‌ముఖులు పోటెత్త‌టంతో ఆసుప‌త్రి వ‌ద్ద భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా క‌రుణ‌ను ప‌రామ‌ర్శించ‌టానికి వ‌చ్చిన ప్ర‌ముఖుల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఒక‌రు. ఆసుప‌త్రికి చేరుకున్న రాహుల్.. క‌రుణ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఐసీయూలో చికిత్స పొందుతున్న క‌రుణ‌ను ప‌రామ‌ర్శించారు.

ఈ సంద‌ర్భంగా క‌రుణ చెవిలో రాహుల్ వ‌చ్చిన‌ట్లుగా చెప్ప‌గా.. ఆయ‌న స్పందించి చిరున‌వ్వు న‌వ్విన‌ట్లుగా డీఎంకే వ‌ర్గాలు చెబుతున్నాయి. క‌రుణ‌ను ప‌రామ‌ర్శించ‌టానికి ఆసుప‌త్రికి వ‌చ్చిన రాహుల్ దాదాపు పావు గంట పాటు రాహుల్ అక్క‌డే ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన రాహుల్.. క‌రుణ త‌మిళ ప్ర‌జ‌ల ఆత్మ అని.. ఆయ‌న చాలా శ‌క్తివంత‌మైన నేత‌గా అభివ‌ర్ణించారు. సుదీర్ఘ‌కాలం త‌మ కుటుంబానికి క‌రుణ‌తో స్నేహంగా ఉంద‌న్నారు. అందుకే.. క‌రుణ‌ను పరామ‌ర్శించేందుకు తాను వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు.

క‌రుణ ఆరోగ్యం కుదుట ప‌డింద‌ని.. ఆయ‌న కోలుకుంటున్న‌ట్లుగా పేర్కొంటూ తాజాగా ఫోటోను విడుద‌ల చేశారు. దీన్లో క‌రుణ స‌న్న‌గా..నీర‌సంగా ఉన్న వైనాన్ని చూసిన త‌మిళులు ప‌లువురు క‌న్నీరు మున్నీరు అవుతున్నారు. త‌మ అభిమాన నేత అలా అయిపోయారేంటి? అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. క‌రుణ‌ను ప‌రామ‌ర్శించిన వారిలో త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రొక‌రు. ఇదిలా ఉంటే.. క‌రుణ అనారోగ్యానికి గురి కావ‌టంతో మ‌నో వ్య‌ధ‌కు గురైన ఇద్ద‌రు గుండెపోటుతో మ‌ర‌ణించారు. టీవీల్లో క‌రుణ వార్త‌లు వింటూ ఉద్విగ్న‌త‌కు లోనై.. గుండెపోటుతో మ‌ర‌ణించారు. దీంతో పెద్దాయ‌న అస్వ‌స్థ‌త వార్త‌ల్ని త‌ట్టుకోలేక‌.. మ‌ర‌ణించిన వారి సంఖ్య ఎనిమిదికి చేరుకోవ‌టం గ‌మ‌నార్హం. ఇంత‌టి అభిమానాన్ని గుండెల్లో పెట్టుకోవటం త‌మిళుల‌కు మాత్ర‌మే చెల్లుతుందేమో?


Tags:    

Similar News