ట్వీట్ పెడితే చాలు.. క్షణాల్లో సాయం చేస్తున్నారు

Update: 2015-12-06 04:26 GMT
మిగిలిన ప్రభుత్వ సంస్థల సంగతేమో కానీ.. భారతీయ రైల్వే అధికారులు మాత్రం ఈ మధ్య కాలంలో దూసుకెళుతున్నారు. తమ దృష్టికి వచ్చిన విషయాలపై క్షణాల్లో రియాక్ట్ అవుతున్నారు. ఆ మధ్యన రైల్వే ప్రయణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు.. తాను ప్రయాణిస్తున్న రైలులో ఒక యువకుడి ప్రవర్తన సందేహాస్పదంగా ఉందంటూ రైల్వేశాఖ ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేసిన వెంటనే స్పందించటమే కాదు.. ఆమె ప్రయాణిస్తున్న రైలు బండి తర్వాతి స్టేషన్ లో ఆగిన వెంటనే.. సదరు యువకుడ్ని వేరే బోగీలోకి తీసుకెళ్లిన వైనం తెలిసిందే.

తాజాగా అందుకు భిన్నమైన రీతిలో స్పందించి అందరి మనసుల్ని భారతీయ రైల్వే అధికారులు దోచుకున్నారు. శనివారం విజయవాడ రైల్వే స్టేషన్ లోని ఆరో నెంబరు ఫ్లాట్ ఫారం మీద ఇద్దరు పిల్లలతో ఒక మహిళ బిక్కుబిక్కు మంటూ కూర్చున్న అంశాన్న ఫోటో తీసిన ఒక యువకుడు.. ఆమెకు సాయం చేయాలంటూ భారతీయ రైల్వే శాఖకు చెందిన ట్విట్టర్ ఖాతా (@RailMinIndia) కు ట్వీట్ చేశారు. అంతే.. క్షణాల్లో రైల్వే యంత్రాంగం స్పందించింది.

ఆమె వద్దకు ఉరుకులు పరుగుల మీద వెళ్లిన అధికారులు.. ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెంగళూరు నుంచి అహ్మదాబాద్ టిక్కెట్టు కొన్న నీతూదేవి పొరపాటున విజయవాడలో దిగిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. చేతిలో డబ్బుల్లేవు. లూధియానాకు వెళ్లాల్సిన ఆమె వివరాల్ని సేకరించిన రైల్వే అధికారులు.. వెంటనే ఆమెకు టిక్కెట్టు ఏర్పాటు చేసి.. హిమసాగర్ ఎక్స్ ప్రెస్ లో పంపించారు. ఇలా స్పందించినందుకు రైల్వే శాఖకు హేట్సాఫ్ చెప్పాల్సిందే.
Tags:    

Similar News