జ‌గ‌న్‌ కు స్వాగ‌తం చెప్పిన వ‌ర్షం

Update: 2019-06-08 05:50 GMT
వ‌ర్షానికి వైఎస్ కుటుంబానికి మ‌ధ్య సంబంధం ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అదే చిత్ర‌మో కానీ.. ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు ఎప్పుడు చేప‌ట్టినా.. చంద్ర‌బాబు హ‌యాంలో వ‌ర్షం ముఖం చాటేయ‌టం.. అదే స‌మ‌యంలో వైఎస్ ఫ్యామిలీ చేతికి అధికారం వ‌చ్చినంత‌నే వ‌ర్షం కుర‌వ‌టం క‌నిపిస్తుంది.

2004 ముందు తీవ్ర‌క‌ర‌వు రాష్ట్రాన్ని తెగ ఇబ్బంది పెట్టేసింది. ఆ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఉండ‌టం తెలిసిందే. 2004లో ప‌వ‌ర్లోకి వ‌చ్చిన వైఎస్ జ‌మానాలో వ‌ర్షాలు స‌మృద్దిగా ప‌డ‌టం క‌నిపిస్తుంది. 2014లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చిన చంద్ర‌బాబు హ‌యాంలో వ‌ర్షాలు స‌రిగా ప‌డ‌క‌పోవ‌టం.. రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఇక్క‌ట్ల‌కు గురికావ‌టం తెలిసిందే.

తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యాన్ని సాధించిన జ‌గ‌న్‌.. సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌టానికి ముందు రోజు రాత్రి కురిసిన భారీ వ‌ర్షంతో హాట్ వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌బ‌డ‌టం తెలిసిందే. తాజాగా సీఎం కార్యాల‌యంలో అడుగు పెట్టే ఈ రోజు కూడా అమ‌రావ‌తి ప్రాంతంలో వ‌ర్షం కురుస్తుండ‌టం విశేషం.

తాడేప‌ల్లిలోని త‌న నివాసం నుంచి జ‌గ‌న్ ఉద‌యం 8.15 గంట‌ల‌కు స‌చివాల‌యానికి బ‌య‌లుదేరారు. తాడేప‌ల్లి.. లోట‌స్.. క‌ర‌క‌ట్ట‌.. చంద్ర‌బాబు నివాసం.. మంతెన ఆశ్ర‌మం.. సీడ్ యాక్సెడ్ రోడ్డు.. మంద‌డం మీదుగా జ‌గ‌న్ స‌చివాల‌యానికి చేరుకున్నారు. త‌న ప్ర‌యాణం కార‌ణంగా సామాన్య ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు.

 ఇదిలా ఉండ‌గా.. మంత్రుల ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి చేసిన ఏర్పాట్లు వ‌ర్షం కార‌ణంగా ఇబ్బందులు త‌లెత్తాయి. స‌చివాలయం పరిస‌ర ప్రాంతాల్లో కుండ‌పోత‌గా వ‌ర్షం కురుస్తోంది. జ‌గ‌న్ కు వెల్ కం చెప్ప‌టానికే వ‌ర్షం కురుస్తుంద‌న్న వ్యాఖ్య‌లు ప‌లువురి నోట వినిపిస్తుండ‌టం విశేషం.

ముందుగా అనుకున్న‌ట్లే.. ఈ రోజు ఉద‌యం (శ‌నివారం) 8.39 గంట‌ల‌కు తొలిసారి స‌చివాల‌యంలోకి అడుగుపెట్టారు. త‌న నివాసం నుంచి నేరుగా స‌చివాల‌యానికి చేరుకున్న ఆయ‌న‌కు స‌చివాల‌య ఉద్యోగులు.. ప‌లువురు నేత‌లు స్వాగ‌తం ప‌లికారు. వేద పండితుల మంత్రోచ్చార‌ణ మ‌ధ్య ఆయ‌న త‌న ఛాంబ‌ర్లోకి అడుగు పెట్టారు.




Tags:    

Similar News