ఆదాయ పన్ను ఎత్తేయండి.. హైకోర్టులో ఆ పార్టీ పిటిషన్‌!

Update: 2022-11-23 10:34 GMT
ఆర్థికంగా వెనుకబడిన వర్గం (ఈడబ్ల్యూఎస్‌) ఆదాయ పరిమితి రూ.8 లక్షలుగా ఉన్నప్పుడు.. ఏడాదికి రూ.2.50 లక్షలు ఆదాయం దాటిన వారి నుంచి ఆదాయ పన్ను ఎలా వసూలు చేస్తారంటూ మద్రాస్‌ హైకోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ను తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ వేసింది. మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనంలో ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం మించని వారి నుంచి వసూలు చేస్తున్న ఆదాయ పన్నును నిలిపేయాలని కోరింది. ఈ మేరకు డీఎంకే ఆస్తుల రక్షణ కౌన్సిల్‌ సభ్యుడు కన్నూర్‌ శ్రీనివాసన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

కేంద్రం.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన పది శాతం రిజర్వేషన్లను తమ రాష్ట్రంలో కల్పించబోమని డీఎంకే ప్రభుత్వం మొండికేస్తోంది. ఈ వ్యవహారాన్ని న్యాయస్థానంలోనే చేర్చుకుంటామని ఇటీవల ప్రకటించింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 8 లక్షల లోపు ఆదాయపరిమితి ఉన్నవారంతా ఆర్థికంగా వెనుకబడిన పేదలని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయని.. మరి ఏడాదికి రూ.2.50 లక్షలు సంపాదించేవారిపైన ఆదాయ పన్ను ఎలా వసూలు చేస్తున్నారని నిలదీసింది.

'రూ.8 లక్షలలోపు ఆదాయం వచ్చేవారిని ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో చేర్చారు. వీరికి అందే పథకాల లబ్ధి పన్ను పరిధిలోకి రావడం లేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2022 ఆర్థిక చట్టం ప్రకారం ఏడాదికి రూ.2.50 లక్షల ఆదాయం ఉంటే పన్ను చెల్లించాలి. అలాంటప్పుడు ఈడబ్ల్యూఎస్‌కు నిర్దేశించిన పరిమితికి అర్థం ఉండటం లేదు.

ఇది రాజ్యాంగంలోని 14, 15, 16, 21, 265 ఆర్టికల్స్‌కు విరుద్ధం. ఈ నేపథ్యంలో 'ఆదాయం' అన్నదానికి కేంద్రం సరైన సమాధానం ఇవ్వాల్సిన అవసరముంది' అని డీఎంకే తన పిటిషన్‌లో పేర్కొంది.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.మహదేవన్, జస్టిస్‌ జె.సత్యనారాయణ కేంద్ర న్యాయ, ఆర్థికశాఖలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నాలుగు వారాల్లో సమాధానమివ్వాలని కేంద్రానికి గడువు ఇచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News