ఆ కేసుతో అరెస్టు అయిన తొలి ఎమ్మెల్యే రాజాసింగ్.. జైల్లో ఎక్కడ ఉంచారంటే?

Update: 2022-08-26 04:30 GMT
ఆగస్టు 22న ప్రపంచాన్ని షాక్ తినేలా షో చేస్తా.. హైదరాబాద్ లో వివాదాస్పద స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖ్ షో కు అనుమతిస్తారా? అంటూ ప్రశ్నించిన బీజేపీ బహిష్క్రత ఎమ్మెల్యే రాజాసింగ్.. అన్నట్లే వివాదాస్పద వీడియోతో పెను సంచలనంగా మారటమే కాదు.. హైదరాబాద్ పాతబస్తీలో హైటెన్షన్ కు కారణమైన సంగతి తెలిసిందే. అతగాడి వీడియో వైరల్ అయిన గంటల వ్యవధిలోనే అరెస్టు చేయటం.. నాంపల్లి కోర్టుకు తరలించటం తెలిసిందే. సరైన విధానంలో అరెస్టు చేయని నేపథ్యంలో రాజాసింగ్ కు కోర్టు బెయిల్ ఇవ్వటం తెలిసిందే.

ఇలాంటి వేళ.. మరింత పకడ్బందీగా కేసును నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు.. ఆయనపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారి పైన పీడీ యాక్టును నమోదు చేస్తారు. అదే పనిగా నేరాలకు పాల్పడే వారి మీదా పీడీ యాక్టు పెడతారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో పీడీ యాక్టు నమోదైన తొలి ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు.

ఆయన అప్ లోడ్ చేసిన వివాదాస్పదవీడియోతో రాజాసింగ్ మీద దేశ వ్యాప్తంగా 101 కేసులు నమోదు కాగా.. ఆయనపై పెట్టిన పీడీ యాక్టుకు సంబంధించిన 32 పేజీల డాక్యుమెంట్ ను అందజేసి.. అరెస్టు చేశారు.

అంతేకాదు.. మంగళ్ హాట్.. షాహినాథ్ గంజ్ లో ఆయనపై రౌడీషీట్ ఓపెన్ చేయటం గమనార్హం. వివాదాస్పద వీడియోలో రాజాసింగ్ వ్యాఖ్యలతో ఘర్షణలు చెలరేగాయని.. పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే పీడీ యాక్టు పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే.. దీనికి సంబందించిన రాజాసింగ్ రియాక్షన్ వేరుగా ఉంది. తనను అరెస్టు చేయటానికి కొన్ని గంటల ముందు రెండు వీడియోల్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా తన వాదనను వినిపించారు.

గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యల వేళ.. తనను ఎమ్మెల్యే పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఫిర్యాదు చేశారని.. మరి అప్పట్లో ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. తాము పూజించే దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన మునావర్ ఫారుఖీని ఎందుకు అరెస్టు చేయరని.. అతడిపై ఎందుకు కేసులు నమోదు చేయరంటూ సూటిగా ప్రశ్నించారు. మునావర్ షో ను ఏర్పాటుకు కారణమైన మంత్రి కేటీఆర్ తోనే ఈ వివాదం మొదలైందని.. ఆయనపై కేసు నమోదు చేయరేం? అని ప్రశ్నించారు.

తాజాగా విడుదల చేసిన వీడియోలో తాను ఏ మతాన్ని కించపర్చలేదని.. కావాలంటే తన 10 నిమిషాల నిడివి ఉన్న వీడియో మొత్తాన్ని చూడాలని చెబుతున్నారు.  తాను ధర్మం ప్రకారమే నడుచుకున్నానని.. తాను తప్పు చేయలేదన్న వాదనను వినిపిస్తున్నారు. అంతేకాదు.. తాజాగా విడుదల చేసిన వీడియోలలో కొందరు పోలీసు అధికారుల మీదా ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
ఇదిలా ఉంటే.. తాజాగా పీడీ యాక్టు కింద అరెస్టు చేసిన రాజాసింగ్ ను రిమాండ్ నకు తరలించారు. గురువారం రాత్రి ఏడు గంటల వేళలో చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. అంతకు ముందు గాంధీ ఆసుపత్రికి తరలించి.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. జైల్లో ఆయనకు మానస బ్యారక్ ను కేటాయించారు. ఈ బ్యారక్ ను తీవ్రమైన నేరాలకు పాల్పడే వారికి కేటాయిస్తారని చెబుతున్నారు.
Tags:    

Similar News