సినీనటులను - అభిమాన నాయకులను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ అయిన తమిళనాడులో మరో కలకలం చోటుచేసుకునే వార్త తెరమీదకు వచ్చింది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎందుకంటే..అనే విషయంలో మీ అంచనా నిజం. తన రాజకీయ అరంగేట్రాన్ని రజనీ జాప్యం చేస్తుండటతో ఆయన ఫ్యాన్ ఈ పనికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి... సేలం జిల్లాలోని అళగాపురం పారైవట్టం ప్రాంతానికి చెందిన రజనీ అభిమాన సంఘం అధ్యక్షుడైన 42 రెండేళ్ల ఏళుమలై.
వివరాల్లోకి వెళితే...నాట్టుకొరు నల్లవన్ రజనీ మందరం అభిమాన సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన రజనీకి పేద్ద ఫ్యాన్. గత కొంతకాలంగా రజనీ రాజకీయ ప్రవేశం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ చర్చోపచర్చలు కొనసాగి తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న పార్టీ ప్రకటన ఉంటుందని అంతా ఆకాక్షించారు. అందరిలాగే ఏళుమలై సైతం ఎదురుచూశాడు. అయితే ప్రకటనలో జాప్యం జరగడంతో నిరాశకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఈ విషయాన్ని గమనించిన ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు గమనించి సేలం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఏలుమలైకి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కోలుకుంటున్నాడని, ప్రాణానికి ముప్పేమి లేదని వైద్యులు తెలిపారు.
కాగా, తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ తన పొలిటికల్ ఎంట్రీ గురించి స్పష్టంగా ప్రకటించకపోయినప్పటికీ...తమిళ రాజకీయాల్లో మాత్రం తీవ్రంగా చర్చ జరుగుతోంది. తమిళ సినీ పరిశ్రమ, రాజకీయవర్గాలు తలైవా వస్తే రాజకీయాలు ఎలా ఉంటాయనే దానిపై తమదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు.